దేశంలో కరోనా విజృంభణ.. లక్షకు చేరువలో పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా విజృంభణ.. లక్షకు చేరువలో పాజిటివ్ కేసులు
ప్రస్తుతం దేశంలో 6లక్షల 58వేల 909 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం లక్షకు చేరువలో పాజిటివ్ కేసులు వెలుగు చూడడం ఆందోళనకు గురిచేస్తోంది. మొత్తం 89వేల 129 కేసులు నమోదుకాగా.. 714 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య కోటి 23లక్షల 92వేల 260కు చేరగా.. మరణాల సంఖ్య లక్షా 64వేల 110కు చేరుకుంది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు కోటి 15లక్షల 69వేల 241 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 6లక్షల 58వేల 909 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక పాజిటివిటీ రేటులో కూడా పెరుగుదల కనిపిస్తుడడం కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. ఫిబ్రవరి ప్రారంభంలో 1.25శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు.. ఇప్పుడు 5శాతానికి చేరింది. రికవరీ రేటు కూడా 93.68శాతానికి తగ్గింది. కేసుల పెరుగుదలతో అప్రమత్తమైన కేంద్రం.. టెస్టింగ్, ట్రేసింగ్ పకడ్బందీగా చేపట్టాలని సూచిస్తోంది.

మరోవైపు దేశంలోని 8 రాష్ట్రాల్లోనే కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని కేంద్రం తెలిపింది. కేవలం 8 రాష్ట్రాల్లోనే 81.42శాతం కేసులు నమోదవుతున్నాయి తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గడ్‌, ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి 81.42 శాతం కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లాల పరంగా చూస్తే.. పుణె, ముంబై, నాగ్‌పూర్, థానే, నాసిక్, బెంగళూరు అర్బన్, ఔరంగాబాద్, ఢిల్లీ, అహ్మద్‌నగర్, నాందేడ్ నగరాల్లో 50 శాతం కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో కేసుల పెరుగుదల తొమ్మిది రెట్లుగా ఉండగా, శాతాల పరంగా పంజాబ్ అత్యధిక శాతంగా నమోదు అవుతున్నాయి.

ఇక దేశం మొత్తం మీద ఒక్క మహారాష్ట్ర నుంచి మాత్రమే 59.36 శాతం కేసులు ఉన్నాయి. అక్కడి 40వేలకు పైగా రోజువారీ కేసులు వస్తున్నాయి. ఇప్పటికే పుణెలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు అధికారులు. అటు కరోనా విజృంభణతో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 1 నుంచి 8తరగతుల వరకు విద్యార్థులు పరీక్షలు రాయకుండానే వారిని పైతరగతులకు ప్రమోట్‌ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. 9, 10, 11 తరగతుల విద్యార్థులకు సంబంధించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అటు ఒడిశాను కరోనా వణికిస్తోంది. దీంతో 10 జిల్లాల్లో నైట్ కర్ఫ్యూను విధించారు అధికారులు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story