భారత్‌లో మళ్లీ ప్రమాద ఘంటికలు

భారత్‌లో మళ్లీ ప్రమాద ఘంటికలు
తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.

భారత్‌లో మళ్లీ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రోజుకు 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదతున్నాయి. నిన్న ఒక్కరోజే 25 వేల మందికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటి వరకూ కరోనా సోకిన వారి సంఖ్య కోటీ 13 లక్షలు దాటింది. నిన్న మరో 161 మంది కరోనా వైరస్ చికిత్స పొందుతూ మరణించారు. వీటితో మొత్తం భారత్‌లో ఇప్పటి వరకూ కరోనాతో ప్రాణాలను కోల్పోయిన వారి సంఖ్య లక్షా 58 వేలు దాటింది. ఒక్క మహారాష్ట్రాల్లో కరోనా విజృంభన అధికంగా ఉంది.

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఏపీలో నిన్న ఒక్కరోజే 45 వేల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారిలో 298 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 90 కొత్త కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 48 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. ఇటు తూర్పు గోదావరి జిల్లాలో 32, కృష్ణా జిల్లాలో 32, విశాఖ జిల్లాలో 32 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇక తెలంగాణలో ప్రజల్లో నిర్లక్ష్యం ఫలితంగా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో ఆరు రోజుల వ్యవధితో పోలిస్తే ఇప్పుడు 26 జిల్లాల్లో కేసులు పెరిగాయి. కొన్నిచోట్ల స్వల్పంగా, మరికొన్నిచోట్ల ఎక్కువగానే నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీలో ఈ నెల 8వ తేదీన 31 కరోనా కేసులుండగా, శనివారం 46 నమోదయ్యాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 8వ తేదీన 10 కేసులుంటే, శనివారం 15 కేసులకు పెరిగాయి. మొత్తం ఇప్పటివరకు 92 లక్షల నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 3 లక్షల మందికిపైగా వైరస్‌ నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు 2 లక్షల 97 వేల మంది కోలుకున్నారు.


Tags

Read MoreRead Less
Next Story