ఢిల్లీని వణికిస్తున్న కరోనా థర్డ్‌ వేవ్‌

ఢిల్లీని వణికిస్తున్న కరోనా థర్డ్‌ వేవ్‌

దేశమంతటా కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, రాజధాని ఢిల్లీలో మాత్రం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. కరోనా థర్డ్‌ వేవ్‌ బెంబేలెత్తిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కొత్త పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీలో ఇప్పటిదాకా 8 వేల మందికి పైగా కరోనా వైరస్‌ బలి తీసుకుంది. కరోనా కట్టడి కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు కఠిన చర్యలను చేపట్టింది. మాస్కు ధరించనివారిపై కొరడా ఝులిపిస్తోంది. వాహనదారులు ఏ ఒక్కరు మాస్కు ధరించకపోయినా.. ఏకంగా 2 వేల రుపాయలు జరిమానా విధిస్తున్నారు పోలీసులు. జూన్‌ 15 నుంచి ఇప్పటివరకు 5 లక్షల మందికి ఫైవ్ వేశారు. . నిన్నఒక్క రోజే 15 వందల మందికి జరిమానా విధించారు పోలీసులు.

అవసరాల కోసం బయటకు వచ్చేటప్పుడు మాస్కును విధిగా ధరించాలని.. ముఖ్యంగా మార్కెట్లల్లో కోవిడ్ నిబంధనలను పాటించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సైతం సూచించారు. ఈ మేరకు మాస్కు ధరించని వారి జరిమానాను ఏకంగా 500 నుంచి 2వేలకు పెంచారు. దీంతో పొరపాటున మాస్కు లేకుండా బయటకు వచ్చేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తూనే.... మాట విననివారికి భారీ జరిమానా విధిస్తున్నారు.

ఇటు కరోనా కరోనా నిబంధనలు పాటించని నాంగ్లోయిలోని పంజాబీ బస్తీ మార్కెట్, జనతా మార్కెట్‌ను పశ్చిమ ఢిల్లీ జిల్లా అధికారులు సీల్ చేశారు. మార్కెట్‌లల్లో ఏమాత్రం కోవిడ్ నిబంధనలను పాటించడం లేదని.. ఈ మేరకు నవంబర్ 30 వరకు రెండు మార్కెట్లను విపత్తు నిర్వహణ అధికారులు సీజ్‌ చేశారు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా, మాస్కులు లేకుండా విక్రయాలను చేపడుతున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. కోవిడ్ మార్గదర్శకాలను పాటించని మార్కెట్లను మూసివేస్తామని కార్పొరేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కేంద్ర హోం శాఖ సైతం రంగంలోకి దిగింది. నవంబర్‌ ఆఖరి వరకు ప్రతిరోజూ 60 వేల ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆసుపత్రుల్లో పడకల సంఖ్య, వసతులు భారీగా పెంచాలని కోరింది. పండుగ సీజన్‌లో కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా పండుగల సమయంలో కరోనా వ్యాప్తి పెద్దగా లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నగరంలో కరోనా కేసుల పెరుగుదలకు వాయు కాలుష్యం కూడా ఒక ముఖ్యమైన కారణమని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story