డబ్ల్యూహెచ్ఓ మరో హెచ్చరిక

డబ్ల్యూహెచ్ఓ మరో హెచ్చరిక

కరోనా వైరస్ కొత్తదే కానీ... ఇదే మొదటిది మాత్రం కాదు. ఎందుకంటే ఇంతకుముందు స్పానిష్ ఫ్లూ వచ్చింది. ఆ తర్వాత సార్స్, మెర్స్ వచ్చాయి. ఇక ఎబోలా, స్వైన్‌ఫ్లూ వంటి ఎన్నో వైరస్‌లు మనుషులను ముప్పతిప్పలు పెడుతున్నాయి. ఇప్పటికే ఎంతోమందిని బలితీసుకున్నాయి. ఒక్క కరోనా వైరసే ఇంతవరకు వరల్డ్‌ వైడ్‌గా దాదాపు 9 లక్షల మందిని పొట్టనపెట్టుకుంది. 2 కోట్ల 75 లక్షలకుపైగా మందికి ఈ మహమ్మారి సోకిందంటే దీని ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

వైరస్‌ల ఉత్పాతాలు, మహమ్మారి విజృంభించడం కామన్ అని చరిత్ర చెప్తోంది. అంతేకాదు భవిష్యత్తులో వీటి దాడి మరింత పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ హెచ్చరించారు. రాబోయే రోజుల్లో వైరస్‌లను ఎదుర్కొనేందుకు ఇప్పటికంటే కూడా ఎక్కువ సంసిద్ధంగా ఉండాలన్నారు. దీని కోసం ప్రభుత్వాలు ప్రజారోగ్యంపై భారీగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉందని టెడ్రోస్ స్పష్టం చేశారు.

కరోనా చికిత్సకు ఇప్పటికే మందులు, ఇంజక్షన్లు వచ్చాయి. అయితే వ్యాక్సిన్ వస్తేనే మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్ అయిందని రష్యా ఆల్‌రెడీ ప్రకటించింది. ఇక మూడో దశ ప్రయోగాలకు ఇండియాతో ఒప్పందం కూడా చేసుకుంది. మరోవైపు ఇప్పటికే ప్రయోగాలు సక్సెస్ కావడంతో టీకాను మార్కెట్లోకి విడుదల చేసినట్లు ఆ దేశం ప్రకటించింది. నవంబర్ 1నే టీకా వస్తుందంటూ అమెరికా ప్రకటించింది. పంపిణీకి ఏర్పాట్లు చేసుకోవాలంటూ రాష్ట్రాల ప్రభుత్వాలకు ఆదేశాలు పంపింది. మన దేశంలోనూ ప్రయోగాలు జోరుగా సాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ టీకాకు సంబంధించిన మరో వాదన వినిపించింది. వ్యాక్సిన్ వచ్చినా అది పేద దేశాలకు అందకపోతే ఫలితం ఉండదని డబ్ల్యూహెచ్‌ఓ అధినేత టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. వెనుకబడిన దేశాలకు వ్యాక్సిన్ అందకపోతే కరోనా వైరస్ మరింత విస్తరించే ప్రమాదం ఉందని కూడా టెడ్రోస్ అన్నారు. అందుకే ప్రతి దేశానికి వ్యాక్సిన్ అందించడం తప్పనిసరి అని ఆయన చెప్పారు. టీకా కొనలేని, తయారు చేసుకోలేని దాదాపు 100 దేశాలకు టీకా అందేలా చూసేందుకు డబ్ల్యూహెచ్‌ఓ కొవ్యాక్స్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భారత్‌ను కూడా భాగస్వామిగా చేర్చుకునేందుకు డబ్ల్యూహెచ్‌ఓ చర్చలు జరుపుతోంది. అయితే ఇందులో చేరబోమని అమెరికా ఇదివరకే స్పష్టం చేసింది. అయితే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పేద దేశాలకు ఎంతమేరకు అందుతుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story