జవనరి 2 నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్‌ డ్రై రన్‌

జవనరి 2 నుంచి దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్‌ డ్రై రన్‌

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సంబంధించి దేశంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వ్యాక్సిన్‌ పంపిణీలో లోటుపాట్లు తెలుసుకునేందుకు ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో డ్రై రన్‌ చేపట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఈ ప్రక్రియను అన్ని రాష్ట్రాల్లో నిర్వహించేందుకు సిద్ధమైంది. జనవరి 2 నుంచి దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ చేపట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల్లో డ్రైరన్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్‌ కోసం 23 కోట్ల సిరింజ్‌ల కోసం కేంద్రం ఆర్డర్లు ఇచ్చింది.

ఏ సమయంలోనైనా వ్యాక్సిన్‌కు అనుమతులు లభించే అవకాశం ఉంది. దీంతో వ్యాక్సిన్‌ సంబంధిత యాప్‌ కొవిన్‌ పనితీరు, సిబ్బంది వినియోగం, కోల్ట్‌ స్టోరేజీలో నిల్వ, తరలింపు వంటి ప్రక్రియలో లోటుపాట్లు తెలుసుకునేందుకు డిసెంబర్‌ 28, 29 తేదీల్లో డ్రైరన్‌ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణాజిల్లాతో పాటు పంజాబ్‌, అసోం, గుజరాత్‌లో ఈ ప్రక్రియ చేపట్టారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ ప్రక్రియ విజయవంతమైందని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త డ్రైరన్‌కు సిద్ధమైంది. మరోవైపు ఎస్‌ఐఐ, భారత్‌ బయోటెక్‌ సంస్థలు తమ టీకాల అత్యవసర వినియోగం కోసం చేసుకున్న దరఖాస్తులను పరిశీలించడానికి నిపుణుల కమిటీ బుధవారం సమావేశమైంది. మరింత లోతుగా చర్చించడానికి రేపు మరోసారి భేటీ కానుంది.


Tags

Read MoreRead Less
Next Story