కొవాగ్జిన్‌పై అనుమానాలన్నీ పటాపంచలు

కొవాగ్జిన్‌పై అనుమానాలన్నీ పటాపంచలు
కొవిడ్‌-19ను మాత్రమే కాదు.. యూకే స్ట్రెయిన్‌ సహా అన్ని స్ట్రెయిన్లనూ కొవాగ్జిన్‌ సమర్థంగా నిరోధించగలదని భారత్ బయోటెక్ తెలిపింది.

భారత్‌లో వ్యాక్సినేషన్‌ నడుస్తున్నా.. ఎక్కడో చిన్న అనుమానాలు. మూడో దశ ట్రయల్స్ ఫలితాలు రాకముందే మార్కెట్లోకి రిలీజ్ చేశారు. కాని, వ్యాక్సిన్‌ సేఫే అని చెప్పేందుకు రాష్ట్రపతి, ప్రధాని, మంత్రులు, ఎమ్మెల్యేలు టీకా వేయించుకున్నారు. కాని, వ్యాక్సిన్ సామర్ధ్యం, తుది ఫలితాలు మాత్రం ఇంత వరకు రాలేదు. కాని, ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ.. భారత్ బయోటెక్ ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. తాము తయారుచేస్తున్న కొవాగ్జిన్‌ సక్సెస్‌ రేటు 81 శాతం ఉందని తేల్చి చెప్పింది. కొవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌ మధ్యంతర ఫలితాలను భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది.

కొవిడ్‌-19ను మాత్రమే కాదు.. యూకే స్ట్రెయిన్‌ సహా అన్ని స్ట్రెయిన్లనూ కొవాగ్జిన్‌ సమర్థంగా నిరోధించగలదని భారత్ బయోటెక్ తెలిపింది. గత నవంబరులో దేశవ్యాప్తంగా 25 ప్రాంతాలకు చెందిన 25వేల 800 మంది వాలంటీర్లపై కొవాగ్జిన్‌ మూడో దశ ట్రయల్స్‌ ప్రారంభించారు. దాని మధ్యంతర ఫలితాలను బట్టి కొవాగ్జిన్ సామర్ధ్యం 81 శాతంగా తేలిందని కంపెనీ ప్రకటించింది. పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ విశ్లేషణ ప్రకారం.. కొవాగ్జిన్‌ టీకా వల్ల శరీరంలో ఉత్పత్తి అయిన యాంటీబాడీలు యూకే స్ట్రెయిన్‌ను, ఇతర స్ట్రెయిన్లను కూడా నిలువరిస్తున్నాయని తేలిందని భారత్‌ బయోటెక్‌ తెలిపింది.

కొవాగ్జిన్ సామర్ధ్యం ఎంత అన్నది సైంటిఫిక్‌గా రుజువవ్వడంతో.. ఈ వ్యాక్సిన్‌పై ఫ్రాన్స్‌ ఆసక్తి చూపిస్తోంది. కొవాగ్జిన్‌ టీకాలు కొనేందుకు ఫ్రాన్స్‌ రాయబారి లెనైన్‌.. హైదరాబాద్ వచ్చారని, భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లాను కలిశారనే వార్తలు కూడా వచ్చాయి. ఫ్రాన్స్ మాత్రమే కాదు... 40కి పైగా దేశాలు కొవాగ్జిన్‌ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయని భారత్‌ బయోటెక్ తెలిపింది.

కొవాగ్జిన్‌ సామర్ధ్యం 81 శాతం అయితే భారత్‌లోనే తయారవుతున్న మరో వ్యాక్సిన్‌... కొవిషీల్డ్ సామర్ధ్యం సగటున 70 శాతం అని తేలింది. ఇక ఫైజర్ సంస్థ తయారుచేసిన వ్యాక్సిన్‌ సామర్ధ్యం 95 శాతం. నోవావాక్స్‌ టీకా సామర్ధ్యం 89.3 శాతంగా నమోదైంది. ఈ లెక్కన కొవాగ్జిన్‌ సామర్ధ్యం తక్కువేం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story