దేశంలో జడలు విప్పుతున్న కరోనా మహమ్మారి

దేశంలో జడలు విప్పుతున్న కరోనా మహమ్మారి
దేశంలో కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తున్న వేళ.. కేంద్రం కఠిన ఆంక్షలు విధించింది

వ్యాక్సిన్ వచ్చేసింది.. కరోనా పోతుంది అనుకునే లోపే మహమ్మారి మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకు ఒకటీ రెండూ కాదు ప్రతిరోజూ వేలాది కేసులు నమోదవుతుండటంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. లాక్ డౌన్ అనంతరం ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రజలు కోలుకుంటున్న నేపథ్యంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో టెన్షన్ మొదలైంది.

దేశంలో కరోనా సెకండ్ వేవ్ దడ పుట్టిస్తున్న వేళ.. కేంద్రం కఠిన ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్లు ఉన్న ప్రతిఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ స్పష్టంచేశారు. అర్హత ఉన్న వారందరు వెంటనే తమ పేర్లను నమోదు చేసుకుని టీకాలు వేయించుకోవాలని సూచించారు. కరోనా సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి అని జవదేకర్ చెప్పారు.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ 2వ మోతాదు తీసుకోవలసిన సమయాన్ని కూడా కేంద్రం సవరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను 4-6 వారాల బదులు 4-8 వారాల మధ్య రెండో డోస్ ఇవ్వాలని సూచించింది. వ్యాక్సిన్ తొలి డోసు వేసుకున్న వారు 4, 8 వారాల్లో రెండో డోసు వేసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు, నిపుణులు సూచిస్తున్నారని ప్రకాశ్ జవదేకర్ స్పష్టంచేశారు.

ఇదిలా ఉంటే.. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి కలవరపెడుతోంది. ప్రధాని మోదీ ఓవైపు అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సూచనలు చేస్తున్నా.. మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ చేపడుతున్నా కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణలో చాపకింద నీరులా విస్తరిస్తున్న వైరస్.. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో పంజా విసురుతోంది. ఏపీలో మంగళవారం ఒక్కరోజే 492 కరోనా కేసులు వెలుగుచూసాయి. చిత్తూరు, విశాఖ జిల్లాల్లో ఇద్దరు మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా కరోనా కేసులు ఉండగా.. ఆ తర్వాత కృష్ణా, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి. అత్యుల్పంగా విజయనగరం జిల్లాలో రెండు, కడప జిల్లాలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి.

అటు రాజమహేంద్రవరం రూరల్ కాతేరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో 140 మంది విద్యార్థులకు కరోనా సోకింది. హాస్టల్‌లోనే విద్యార్థుల్ని ఐసోలేట్ చేసి చికిత్స అందిస్తూ.. కాలేజీ పరిసరాలు శానిటైజ్ చేసి కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించిన అధికారులు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోను కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ఇప్పటివరకు మొత్తం 14 కేసులు నమోదుకాగా.. మంగళవారం వీరశైవ ఆగమ పాఠశాలలో 9 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

మరోవైపు మహారాష్ట్రలో 30వేల కేసులు నమోదవుతుండటం కలవరపెడుతోంది. ఇప్పటికే ఉద్ధవ్ ప్రభుత్వం పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ప్రకటించడంతో పాటు నైట్ కర్ఫ్యూను సైతం అమలు చేస్తోంది. అయినా మహారాష్ట్రలో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అటు తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ తదితర రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించి విద్యాసంస్థలను మూసివేశారు. కరోనా నిబంధనలను కఠినతరం చేస్తూ ఆంక్షలు విధించాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించాయి. ఏదిఏమైనా కరోనా మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తున్న వేళ.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేలా చూసుకోవాలి.


Tags

Read MoreRead Less
Next Story