దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం .. టీకా ధర ఎంతంటే?

దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం .. టీకా ధర ఎంతంటే?
తెలంగాణలో 102 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్‌ ప్రారంభం అయింది. ఈ విడతలో వృద్ధులకు టీకాలు వేస్తున్నారు. తెలంగాణలో 102 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్‌ డోసు ధర ప్రైవేట్‌ హాస్పిటళ్లలో 250 రూపాయలుగా నిర్ధారించిన కేంద్రం.. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఉచితంగా పంపిణీ చేయనున్నట్టు తెలిపింది.

టీకాల కోసం నేటి నుంచి 'కొ-విన్' డిజిటల్ ప్లాట్‌పామ్‌లో వృద్ధులు తమ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయుష్మాన్ భారత్-పీఎంజేఏవై కింద ఎంపానెల్ చేసిన 10 వేల హాస్పిటళ్లు, కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం కింద 687 హాస్పిటళ్లను కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగించుకోవచ్చని కేంద్రం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య బీమా పథకం కింద ఎంపానెల్ చేసిన అన్ని ప్రైవేటు హాస్పిటళ్లను సీవీసీలుగా ఉపయోగించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది.

అటు... కోవిడ్ నియంత్రణలో భాగంగా ఇప్పటికs 4 లక్షల 75 వేల మందికి వ్యాక్సిన్‌ అందించామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. నేటి నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు. వృద్ధులతోపాటు 45 ఏళ్లు దాటి... దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలంగాణ ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు.

నేటి నుంచి రెండో విడత వ్యాక్సినేషన్‌కు కేంద్రం సిద్ధమైన నేపథ్యంలోనే కరోనా వ్యాక్సిన్ ధరల్ని ప్రకటించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో టీకా డోసు ధర 250 రూపాయలకు మించకూడదని, ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగానే వ్యాక్సిన్ అందించనున్నట్టు తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా ధర 150 రూపాయలు కాగా.. సర్వీసు చార్జీగా మరో 100 రూపాయలు వసూలు చేయనున్నాయి.



Tags

Read MoreRead Less
Next Story