ఉత్తరాఖండ్‌కు మరో భయం!

ఉత్తరాఖండ్‌కు మరో భయం!
మరో ఉత్పాతం తప్పదనే ఆందోళన అక్కడి వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

ఉత్తరాఖండ్‌కు మరో భయం పట్టుకుంది.. మరో ఉత్పాతం తప్పదనే ఆందోళన అక్కడి వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.. ఇటీవల సంభవించిన జల ప్రళయం కారణంగా ప్రమాదకర సరస్సు ఏర్పడింది.. ఈ సరస్సే అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.. ఉత్పాతం వల్ల ఏర్పడిన శిథిలాలు ఒక ప్రవాహాన్ని అడ్డుకోవడంతో ఆ నీరంతా అక్కడే నిలిచిపోయి ఒక సరస్సుగా ఏర్పడింది. వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని నిర్ధారించారు.

జలవిలయం మరుసటి రోజు హెలికాప్టర్‌ ద్వారా ఆ ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించిన సైంటిస్టులు అక్కడ సరస్సు ఏర్పడినట్లుగా గుర్తించారు. ఒకవేళ ఆ శిథిలాలు తొలగిపోతే సర్సులోని నీరంతా రిషిగంగ నదిలోకి ప్రవేశించి మరోసారి ప్రమాదం జరిగే అవకాశం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఆ సరస్సును అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.. 350 మీటర్ల పొడవు, 60 మీటర్ల ఎత్తులో లేక్‌ ఏర్పడినట్లుగా వెల్లడించారు. అయితే, ఇందులో నీటిమట్టం క్రమంగా పెరుగుండటాన్ని సైంటిస్టులు గుర్తించారు. నీరు మరింతగా పెరిగితే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.

నీటి మట్టం పెరిగే కొద్దీ చుట్టుపక్కల పేరుకుపోయిన శిథిలాలపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది.. ఏ క్షణమైనా ఉప్పొంగి మరోసారి వరద సంభవించే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. అటు ఈ సరస్సుపై ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ కూడా స్పందించారు. మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన ప్రజలకు సూచించారు. ఎయిర్‌ డ్రాఫ్ట్‌ నిపుణులను పంపి పరిస్థితిని సమీక్షిస్తామని చెప్పారు.

మరోవైపు జల ప్రళయానికి కారణాలను అన్వేషిస్తున్నారు నిపుణులు.. హిమనీనదం నుంచి ఓ భాగం కూలిపోవడం వల్లే వరదలు సంభవించినట్లుగా అనుమానిస్తున్నారు.. వాతావరణ మార్పులు, ఉష్ణోగ్రతలు పెరగడంతోపాటు మంచు పర్వతాల్లో కరుగుదల వేంగా జరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. హిమనీనదాల కరుగుదల ఎక్కువగా ఉన్నప్పుడు సరస్సుల్లో నీటిమట్టం వేగంగా పెరుగుతోందని.. అదే ఆకస్మిక వరదలకు కారణమవుతోందని అంటున్నారు. ఇక జల విలయం కారణంగా తపోవన్‌ సొరంగంలో చిక్కుకుపోయిన 30 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదం జరిగి ఏడు రోజులు గడిచిపోవడంతో అందులో చిక్కుకుపోయిన వారి క్షేమంపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story