కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలకు డీసీజీఐ అనుమతి

కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలకు డీసీజీఐ అనుమతి
దేశంలోని అందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్‌ వేస్తారు. ప్రభుత్వమే నేరుగా ఔషధ కంపెనీల నుంచి వ్యాక్సిన్లు కొంటోంది.

కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ టీకాలకు DCGI అనుమతి ఇచ్చింది. అత్యవసర వినియోగానికి షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నట్లు DCGI ప్రకటించింది. కేంద్ర నిపుణుల కమిటీ కూడా సిఫార్సు చేయడంతో ఈ రెండు కరోనా వ్యాక్సిన్లకు అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. DCGI నుంచి టీకాలకు అనుమతి రావడంతో వచ్చే వారంలోనే కరోనా వ్యాక్సినేషన్ మొదలుకానుంది. భారత్‌ బయోటెక్‌ తయారుచేస్తున్న కొవాగ్జిన్‌ అత్యంత భద్రమైనదని ఇప్పటికే నిర్ధారణ అయిందని DCGI డైరెక్టర్ జనరల్ సోమని తెలిపారు. కొవిషీల్డ్‌ టీకా భద్రత, సమర్ధతపై సీరం సంస్థ కూడా వివరాలు సమర్పించిందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్లను రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుందని DCGI తెలిపింది. కరోనా వ్యాక్సిన్ల వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్‌ ఉండవని DCGI హామీ ఇచ్చింది.

డీసీజీఐ అనుమతి ఇవ్వడంతో వచ్చే వారం నుంచే దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలవుతుంది. ఇప్పటికే, దేశంలోని అన్ని రాష్ట్రాలు డ్రైరన్‌ను విజయవంతంగా పూర్తి చేశాయి. వ్యాక్సిన్‌ను ఎవరికి ముందుగా ఇవ్వాలి, ప్రాధాన్యతా క్రమంలో ఎవరిని ముందుగా చేర్చాలనే దానిపై ఇప్పటికే ఓ స్పష్టత ఇచ్చారు. ప్రైవేటు, ప్రభుత్వ రంగంలోని దాదాపు కోటి మంది ఆరోగ్య సిబ్బంది, రెండు కోట్ల మంది మున్సిపల్‌, విపత్తు నిర్వహణ, జైళ్ల సిబ్బంది, సాయుధ దళాలు, పోలీసులు, హోంగార్డులు, సివిల్‌ డిఫెన్స్‌ ఆర్గనైజేషన్స్‌ సిబ్బంది, కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లోని రెవెన్యూ సిబ్బందికి ముందుగా టీకా వేస్తారు.

ఆ తరువాత 50 ఏళ్లు పైబడిన వారికి టీకా వేయడం మొదలుపెడతారు. ఒకవేళ 50 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి.. ఒకటి కంటే ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్నట్టైతే వారిని కూడా ఈ జాబితాలో చేర్చి టీకాలు వేస్తారు. బీపీ, షుగర్, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వ్యాక్సిన్ ముందుగా ఇస్తారు. ఇక దేశంలో కరోనా తీవ్రత ఎక్కడెక్కడ ఎక్కువగా ఉందో ఆ ప్రాంతంలోని వాళ్లందరికీ ఫస్ట్ ప్రయారిటీ కింద టీకా వేస్తారు. వీళ్లందరూ ప్రభుత్వం చెబుతున్న 30 కోట్ల మంది జాబితాలోని వారే.

వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ముందుగా కొవిన్‌ వెబ్‌సైటులో నమోదు చేసుకోవాలి. ప్రభుత్వ ఫొటో గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయాలి. లేదా ఓటీపీ, బయోమెట్రిక్స్‌, డెమోగ్రాఫిక్‌ విధానంలో ఆధార్‌నెంబరుతో అథెంటికేషన్‌ పొందాలి. నమోదు చేసుకున్న తర్వాత టీకా ఇచ్చే తేదీ, సమయం కేటాయిస్తారు. ముందుగా నమోదు చేసుకున్న వారికే టీకా అందుతుంది. టీకాల కోసం ఎంతో దూరం వెళ్లక్కర్లేదు. ఆస్పత్రులు, స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లలో టీకాలు వేస్తారు. రవాణా సదుపాయం లేని ప్రాంతాల్లో స్పెషల్‌ మొబైల్‌ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తారు.

దేశంలోని అందరికీ ఉచితంగానే కరోనా వ్యాక్సిన్‌ వేస్తారు. ప్రభుత్వమే నేరుగా ఔషధ కంపెనీల నుంచి వ్యాక్సిన్లు కొంటోంది. కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ ఒక్కో డోసును భారత ప్రభుత్వం 440 రూపాయలు పెట్టి కొంటోంది. బయట మార్కెట్‌లో దీని ధర 700 నుంచి 800 వరకు ఉండొచ్చని సీరం సంస్థ చెప్పింది. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు 80 కోట్ల సిరంజిలను ఆర్డర్ చేసింది. అన్నీ సవ్యంగా జరిగితే జనవరి 9 నుంచే భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటి వరకు రెండు వ్యాక్సిన్లకు షరతులతో కూడిన అత్యవసర అనుమతులు మాత్రమే ఇచ్చారు. వ్యాక్సిన్‌ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ముందే వివరించి.. అన్నింటికీ ఒప్పుకుంటున్నట్టు అనుమతి పత్రం తీసుకున్న తరువాతే వ్యాక్సిన్ ఇస్తారు. భారత్ బయోటెక్‌ తయారుచేస్తున్న కొవాగ్జిన్‌.. ఇంకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లోనే ఉంది కాబట్టి.. ప్రస్తుతానికి దీనికి అత్యవసర వినియోగానికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే వ్యాక్సిన్‌ పూర్తిగా సురక్షితమైనదేనని అటు డీసీజీఐ, ఇటు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ హామీ ఇచ్చారు. వ్యాక్సిన్‌కు ఆమోద ముద్ర వేసే ముందు దానిని పరీక్షించడంలోనూ, ప్రొటోకాల్‌ నిబంధనలు అనుసరించడంలో ఎలాంటి రాజీ ఉండదని చెప్పారు. వ్యాక్సిన్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌పై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని కేంద్రమంత్రి అన్నారు.


Tags

Read MoreRead Less
Next Story