అందమైన మోసం.. అమ్మాయిలా చాట్ చేసి.. రూ.21లక్షలు దోచుకుని..

అందమైన మోసం.. అమ్మాయిలా చాట్ చేసి.. రూ.21లక్షలు దోచుకుని..
చాలీ చాలని సంపాదనతో తృప్తి చెందని దంపతులు ఆన్‌లైన్ మోసాలకు పథకం వేశారు.

అకౌంట్ ఖాళీ అయిన తరువాత మోసపోయామని తెలుసుకుంటున్నారు.. ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు.. రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలు పోలీసులకు తలనొప్పిగా మారాయి. పది చదువుకున్నా టెక్నాలజీలో పరిజ్ఞానం సంపాదిస్తున్నారు. చోర కళలో ఆరి తేరుతున్నారు. అమ్మాయిలా చాట్ చేసి ఓ అబ్బాయిని బుట్టలో పడేశాడు.. పెళ్లి పేరుతో అతడి దగ్గర నుంచి 21 లక్షల రూపాయలు దోచుకున్నాడు.

వివరాల్లోకి వెళితే.. విజయవాడకు చెందిన కంపా హృదయానంద్ 2017లో అనూష అలియాస్ హారికను పెళ్లి చేసుకున్నాడు. హారికకు ఇంతకు ముందే పెళ్లై విడాకులు తీసుకుని హృదయానంద్‌ను చేసుకుంది. అయితే అతడు అనారోగ్యం పాలవడంతో ఏ పనీ చేయలేకపోయేవాడు. ఈ క్రమంలో హారిక హైదరాబాద్‌లోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌లో పని చేయడం మొదలు పెట్టింది. చాలీ చాలని సంపాదనతో తృప్తి చెందని దంపతులు ఆన్‌లైన్ మోసాలకు పథకం వేశారు.

హారికా హృదయానంద్ పేరుతో ఓ ఫేక్ ప్రొఫైల్ తయారు చేసి గుర్తు తెలియని అందమైన యువతి ఫోటోతో ఇండియన్ డేటింగ్.కామ్ అనే వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు. నేరేడ్‌మెట్‌కు చెందిన డొనాల్డ్ హోరసీస్ రోజారియో అనే వ్యక్తి చాటింగ్ మొదలు పెట్టాడు. హృదయానంద్ తాను యువతి అనుకునే అతడు చాటింగ్ చేయడం ప్రారంభించాడు. గుండెజబ్బుతో బాధపడుతున్న తన తల్లికి ఆపరేషన్ చేయించడానికి డబ్బులు కావాలంటే డొనాల్డ్ ఆర్థిక సాయం చేశాడు. ఆన్‌లైన్‌లో కోరినంత డబ్బు పంపాడు.

ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత తల్లి మరణించిందని, సోదరికి చికిత్స చేయించాలని మరి కొంత డబ్బు కావాలని అడిగాడు హృదయానంద్. ఇలా అడిగిన ప్రతిసారి డబ్బు పంపేవాడు. ఆ విధంగా పంపిన మొత్తం దాదాపు రూ.21 లక్షలు అయింది. వీరి చాటింగ్ పెళ్లి వరకు వెళ్లినా హృదయానంద్ వాయిదా వేస్తూ వస్తున్నాడు.. చివరకు అనుమానం వచ్చిన డొనాల్డ్ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి విజయవాడ వెళ్లి నిందితులను పట్టి తెచ్చారు. శుక్రవారం హృదయానంద్‌ని, భార్య హారికను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పెళ్లి విషయంలో ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ హరినాథ్ నెటిజన్లకు సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story