రైతుల ఆందోళనలపై స్వయంగా రంగంలో దిగిన ప్రధాని మోదీ

రైతుల ఆందోళనలపై స్వయంగా రంగంలో దిగిన ప్రధాని మోదీ

కొత్త వ్యవసాయ చట్టాలపై రైతలు ఆందోళనలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో.. ప్రధాని నరేంద్ర మోదీ రంగంలో దిగారు. ఇప్పటికే రైతులతో కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్‌, పియూష్‌ గోయల్ చర్చలు జరపగా.. అవేమీ కొలిక్కిరాలేదు. దీంతో ఈసారి స్వయంగా ప్రధాని ఆ బాధ్యతను తీసుకున్నారు. రైతులతో కేంద్ర మంత్రులు మూడో విడత చర్చలు జరపనున్న నేపథ్యంలో.. ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌, హోం మంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో.. ప్రధాని సమావేశమయ్యారు. తాజా పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు. గత మంగళవారం, గురువారం కేంద్రం వారితో చర్చలు జరిపింది. అయితే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పట్టుబట్టడంతో.. చర్చల్లో ఎలాంటి పురోగతి లేదు.

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. రైతుల ఆందోళనలు 11వ రోజుకు చేరుకున్నాయి. ఢిల్లీ శివార్లలో లక్షల మంది రైతులు నిరసనలు తెలుపుతున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోంది. గడ్డకట్టే చలిలోనూ రోడ్లపై ట్రాక్టర్లు, ట్రక్కుల్లో ఉంటున్నారు. అక్కడే వంట చేసుకుని తమ నిరసన కొనసాగిస్తున్నారు. సింఘు, టిక్రి సహా.. ఢిల్లీ సరిహద్దుల్లో పోలీసుల భద్రత కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. కొత్త చట్టాలతోపాటు విద్యుత్ సవరణ బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

తమ డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 8 భారత్‌ బంద్ చేపట్టాలని రైతులు ఇప్పటికే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు.. రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరగాల్సిన భేటీపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ఢిల్లీ నోయిడాను కలిపే చిల్లా సరిహద్దుల్లో వేలాది మంది రైతులు బైఠాయించి నిరసన సాగిస్తున్నారు. నేటి చర్చల్లో సానుకూల ఫలితం రాకపోతే పార్లమెంటును ముట్టడిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. అన్నదాతల ఆందోళన నేపథ్యంలో చిల్లా రహదారిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. అటు ఢిల్లీ- యూపీని కలిపే 24వ జాతీయరహదారిపై ఉన్న ఘజియాపూర్‌- ఘజియాబాద్ సరిహద్దును కూడా మూసివేశారు.


Tags

Read MoreRead Less
Next Story