ఎట్టకేలకు ఢిల్లీలోకి రైతులకు అనుమతి

ఎట్టకేలకు ఢిల్లీలోకి రైతులకు అనుమతి

రైతన్నలు పట్టు వీడటంలేదు.. అడుగు వెనక్కి వేయలేదు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన గళం వినిపిస్తున్నారు. పోలీసులు లాఠీలు ఝులిపించినా.. జల ఫిరంగులతో భయపెట్టినా.. ఏమాత్రం తగ్గకుండా ఉరిమే ఉత్సాహంతో ముందుకు కదిలారు. దీంతో ఎట్టకేలకు దిగివచ్చిన పోలీసులు.. హస్తినలో అన్నదాతల నిరసన ప్రదర్శనకు అనుమతిచ్చారు. ఢిల్లీలోని నిరంకారి స్టేడియంలో శాంతియుత నిరసనకు అనుమతిచ్చారు. అంతకుముందు ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్న రైతులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిణామాలు చోటుచేసుకున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని కోరుతూ వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు దేశ రాజధాని ఢిల్లీని చుట్టుముట్టారు. కరోనా నేపథ్యంలో ఢిల్లీలో ర్యాలీలకు అనుమతి లేదని ప్రభుత్వం చెప్పినప్పటికీ వెనక్కు తగ్గలేదు. ఐదు జాతీయ రహదారుల మీదుగా రైతులు రాజధాని వైపు కదిలారు.

అయితే రైతులను ఢిల్లీలోకి రానీయకుండా హర్యానా సరిహద్దుల్లో పోలీసులు నిలిపివేశారు. బారీకేడ్లు, బాష్పవాయువులు, వాటర్ ట్యాంకులతో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా కానీ రైతులు ట్రాక్టర్లలతో ముందుకు కదులుతుండటంతో అనేక చోట్ల పోలీసులు ఇసుక బస్తాలను పేర్చారు. పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతులు మాత్రం వెనక్కి తగ్గలేదు. మరోవైపు రైతుల ఉద్యమానికి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో రైతు సంఘాల నాయకులను కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం చర్చకు పిలిచాయి.

ఈ చర్చల తర్వాత ఎట్టకేలకు ఢిల్లీ బురాన్‌లోని నిరంకారి మైదానంలో రైతులు నిరసన తెలిపేందుకు అనుమతి లభించింది. అయితే పోలీసుల పహారాలోనే రైతులంతా నగరంలోకి రావాలని షరతు విధించారు. దీంతో అనేక ఉద్రిక్త పరిస్థితుల నడుమ రైతులు నిరంకారి మైదానంకు తరలివస్తున్నారు. రోడ్లపైనే వంటా వార్పు చేసుకుంటున్నారు. మరోవైపు ఈ నిరసనల్లో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story