వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ 'చలో ఢిల్లీ' ఆందోళన ఉద్రిక్తం

వ్యవసాయ చట్టాల్ని వ్యతిరేకిస్తూ చలో ఢిల్లీ ఆందోళన ఉద్రిక్తం

నూతనంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలు చోట్ల లక్షలాది మంది రైతులు చేపట్టిన 'చలో ఢిల్లీ' ఆందోళన ఉద్రిక్తంగా మారింది. కరోనా నేపథ్యంలో రైతుల ఆందోళనకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతినివ్వలేదు. అయినప్పటికీ రైతులు దేశ రాజధాని దిశగా కదం తొక్కారు. ఢిల్లీ సరిహద్దుల్లో హర్యాణా రైతులను సాయుధ బలగాలు అడ్డుకున్నాయి. శంభు నదిపై పాటియాలా-అంబాలా జాతీయ రహదారి వద్ద రైతుల్ని పోలీసు బలగాలు నిలువరించాయి. ఆగ్రహించిన రైతులు భద్రతా సిబ్బంది అడ్డుగా పెట్టిన బారికేడ్లను వంతెనపై నుంచి నదిలోకి పడేశారు. పోలీసులపైకి రాళ్లు విసిరారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించారు. శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రైతుల ఆందోళన నేపథ్యంలో హర్యాణా నుంచి దిల్లీ వచ్చే మార్గాల్లో సాయుధ బలగాలు భారీగా మోహరించాయి. దిల్లీలోకి రైతులు రాకుండా సోనిపట్‌ వద్ద సరిహద్దుల్ని మూసేసి సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రోహ్‌తక్‌-ఝజ్జర్‌ సరిహద్దుల్లోనూ పోలీసులు భారీగా మోహరించారు.

రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విమర్శలు గుప్పించారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకం అని అన్నారు. వాటిని వెనక్కి తీసుకోవడానికి బదులు ఆందోళన చేస్తున్న రైతులపై జలఫిరంగులు ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. శాంతియుత ఆందోళనలు చేయడం రాజ్యాంగ హక్కు అని తెలిపారు. రైతులపై జలఫిరంగులు ప్రయోగించడం కచ్చితంగా తప్పే అని కేజ్రీవాల్‌ దుయ్యబట్టారు.


Tags

Read MoreRead Less
Next Story