చక్కా జామ్‌కు రైతుల సన్నాహాలు.. మధ్యాహ్నం రహదారుల దిగ్బంధం

చక్కా జామ్‌కు రైతుల సన్నాహాలు.. మధ్యాహ్నం రహదారుల దిగ్బంధం
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు దేశ వ్యాప్తంగా రహదారులను దిగ్బంధించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చ వెల్లడించింది.

సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు మరింత ఉద్ధృతం చేశారు రైతులు. చక్కా జామ్ ఆందోళనలకు సిద్ధమయ్యారు రైతులు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు దేశ వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధించనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చ వెల్లడించింది. అయితే అత్యవసర సర్వీసులైన అంబులెన్స్‌లు, స్కూల్ బస్సులను అడ్డుకోబోమని రైతు సంఘం నేతలు వెల్లడించారు. రైతులు చక్కాజామ్‌కు పిలుపునివ్వడంతో ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు..దీక్ష కొనసాగుతోన్న మూడు ప్రాంతాల్లో అదనపు బలగాలను రంగంలోకి దించారు. దిల్లీకి వచ్చే మూడు సరిహద్దుల్లో భారీ ముళ్లకంచెలు, మేకులతో, బారికేడ్లను ఏర్పాట్లు చేసి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నారు.

సాగు చట్టాలపై ప్రభుత్వం దిగి వచ్చేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని ఇప్పటికే రైతు సంఘాల నాయకులు స్పష్టం చేశారు. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల దిగ్బంధన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పోలీసుల అనుమతి ఇవ్వనప్పటికీ..దేశవ్యాప్తంగా శాంతియుతంగా చక్కాజామ్‌ చేపడతామని.. బీకేఎస్‌ నేత రాకేశ్ తికాయక్‌ తెలిపారు.

అయితే, జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో ఈసారి పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆందోళన చేస్తోన్న రైతులను ఢిల్లీ నగరంలోకి అడుగుపెట్టనీయకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. సింఘు దీక్షాస్థలి వద్ద భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించడంతో పాటు ఘాజీపూర్ సరిహద్దులోనూ బారికేడ్లను ఏర్పాటు చేశారు. పరిస్థితులను బట్టి మరిన్ని బలగాలను రంగంలోకి దించడం, లేదా మరిన్ని బారికేడ్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పోలీసులు వెల్లడించారు.

ముందు జాగ్రత్తగా సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి అసత్య వార్తలు, వదంతులు వ్యాప్తిచేయకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులువెల్లడించారు. ఇతర రాష్ట్రాల పోలీసులతోనూ ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తామని తెలిపారు. నగరంలోకి వచ్చే ప్రతి ఒక్కరినీ నిశితంగా పరిశీలించిన తర్వాతే వారిని లోనికి అనుమతిస్తున్నామని పేర్కొన్నారు.


Tags

Read MoreRead Less
Next Story