కేంద్రం సంచలన నిర్ణయం.. రాజ్యసభలో ఆర్టికల్‌ 370రద్దు బిల్లు

కేంద్రం సంచలన నిర్ణయం.. రాజ్యసభలో ఆర్టికల్‌ 370రద్దు బిల్లు

ఆర్టికల్‌ 370 అనేది కేంద్రానికి జమ్ముకశ్మీర్‌తో ఉన్న బంధాన్ని వివరిస్తుంది. దేశ రక్షణ, విదేశాంగ, సమాచార వ్యవహారాల్లో మినహా మిగిలిన విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు కేంద్రానికి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సరిహద్దులను మార్చే అధికారం కూడా పార్లమెంట్‌కు లేదు. దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించినా కశ్మీర్‌ విషయంలో నిర్ణయాధికారం కేంద్రానికి ఉండదు.

ఇక ఆర్టికల్‌ 35ఏ ద్వారా జమ్ము కశ్మీర్‌లో శాశ్వత నివాసితులు ఎవరు అనేది స్పష్టంగా నిర్వచించారు. దాని ప్రకారం 1911కు ముందు జమ్మూ కశ్మీర్‌లో జన్మించిన లేదా స్థిరపడిన వారు లేదా అంతకు కనీసం పదేళ్ల ముందు ఆ రాష్ట్రంలో స్థిరాస్తులు కొన్నవారు మాత్రమే స్థానికులు. వారికి మాత్రమే ఆస్తులు కొనుగోలు చేసే హక్కు ఉంటుంది. అలాగే ఇతరులకు ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. స్కాలర్ షిప్‌లు, ఇతర ప్రభుత్వ పథకాలు కూడా స్థానికేతరులకు వర్తించవు. అలాగే స్థానికేతరులకు ఇక్కడి ఎన్నికల్లో పోటీ చేసే అధికారం కూడా ఉండదు. ఈ చట్టాన్ని నిర్వచించే సమయంలో స్త్రీల హక్కుల విషయంలో కాస్త భిన్నంగా వ్యవహరించారు. శాశ్వత నివాసి అయిన కశ్మీరీ అమ్మాయి, ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆమె తనకున్న ఆస్తి హక్కును కోల్పోతుంది. అదే కశ్మీరీ అబ్బాయి వేరే అమ్మాయిని చేసుకున్నా వారికి హక్కులు యథాతథంగానే ఉంటాయి. అమ్మాయిల ఆస్తి హక్కు విషయంపై 2002లో జమ్మూ కశ్మీర్‌ హైకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. శాశ్వత నివాసి కాని వ్యక్తిని పెళ్లి చేసుకున్నంత మాత్రాన మహిళకు కూడా హక్కులు లేకుండాపోవని వారికి కూడా అన్ని హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది.

కేంద్రం ఆర్టికల్ 370 రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చారిత్రత్మకం అనే చెప్పాలి. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టుగానే రద్దు దిశగా అడుగులు వేసింది కేంద్రం . జమ్ముకశ్మీర్‌లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు విషయంపై నిన్ననే హోంశాఖ సుదీర్ఘంగా చర్చలు జరిపింది. జమ్ము కాశ్మీర్ పునర్ విభజన బిల్లును సభలో పెట్టారు. ఆర్టికల్ 370 రద్దయితే.. ఇప్పటివరకూ ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి పోతుంది. అలాగే దాంట్లో అంతర్భాగమైన అధికరణం 35Aకూడా ఆటోమెటిగ్గా రద్దవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story