గుజరాత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం.. మోదీ ట్విట్

గుజరాత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం.. మోదీ ట్విట్
భారీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆనందం వ్యక్తం చేశారు.

గుజరాత్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. అన్ని కార్పొరేషన్లలోనూ విక్టరీ సాధించి క్లీన్‌స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో 576 డివిజన్లకు గాను బీజేపీ 466 చోట్ల విజయం సాధించి సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. కేవలం 45 స్థానాలకే పరిమితమైపోయింది. ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన ఆప్‌ బోణీ కొట్టింది. సూరత్‌ కార్పొరేషన్‌లో 27 డివిజన్లు గెలుచుకొని పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్‌ నింపింది. మరోవైపు ఎంఐఎం పార్టీ ఏడు స్థానాల్లో సత్తా చాటింది. అటు 27 స్థానాల్లో గెలుపొందడంతో ఆప్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ నెల 26న సూరత్‌లో జరగబోయే విజయోత్సవ ర్యాలీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ హాజరుకానున్నారు.

గుజరాత్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో దక్కిన భారీ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆనందం వ్యక్తంచేశారు. మరోసారి ప్రజలు అందించిన అపూర్వ విజయానికి కృతజ్ఞతలు తెలిపారు. గుజరాత్‌ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా అనుకూల విధానాలే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల్లో ప్రభావం చూపాయని ప్రధాని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ ఫలితాలు అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాల పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. బీజేపీ పట్ల నమ్మకం ఉంచి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తనూ ప్రశంసిస్తున్నట్టు పేర్కొన్నారు. గుజరాత్‌ ప్రజలకు సేవచేయడం ఎప్పుడూ గౌరవంగా భావిస్తానన్నారు ప్రధాని మోదీ.

Tags

Read MoreRead Less
Next Story