కోవాగ్జిన్ టీకాపై రాజకీయాలు చేయద్దు : భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌

కోవాగ్జిన్ టీకాపై రాజకీయాలు చేయద్దు : భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌
వ్యాక్సిన్ల విషయంలో తమకు గ్లోబల్‌ లీడర్‌ షిప్‌ ఉందన్నారు భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌.

కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి DCGI అనుమతివ్వడం పట్ల భార‌త్‌ బ‌యోటెక్ సంస్థ ఛైర్మన్‌ డాక్టర్ ఎల్లా కృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు, వాలంటీర్లకు ఈ విజయం అంకితమన్నారు. కోవాగ్జిన్ పై రాజకీయాలు చేయోద్దని.. త‌మ సంస్థకు అనుభ‌వం లేద‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాదని డాక్టర్ ఎల్లా కృష్ణా అన్నారు. కొవాగ్జిన్ సురక్షితమైన ఇనాక్టివేటెడ్‌ వ్యాక్సిన్‌ అని తెలిపారు. కొవాగ్జిన్‌పై అన్ని కమిటీలకు పారదర్శకమైన సమాచారం ఇచ్చామన్నారు. ఇక డేటా అంశంలో పార‌ద‌ర్శకంగా లేమ‌ని చెప్పడం అస‌త్యమన్నారు. బ్రిటన్ సహా 12 దేశాల్లో కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు తెలిపారు. వ్యాక్సిన్ల విషయంలో తమకు గ్లోబల్‌ లీడర్‌ షిప్‌ ఉందన్నారు.

భారత్‌ బయోటెక్‌.. కేవలం భారత్‌కే పరిమితమైన కంపెనీ కాదని.. తమది గ్లోబల్‌ కంపెనీ అని.. ఇప్పటికే అనేక ర‌కాల వ్యాక్సిన్ల‌ను త‌యారు చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. త‌మ కంపెనీ 16 ర‌కాల టీకాల‌ను త‌యారు చేసిన‌ట్లు కృష్ణ ఎల్లా చెప్పారు. చికెన్ గున్యా సహా అనేక వ్యాధులకు తాము వ్యాక్సిన్లు తయారు చేశామన్నారు. గతంలో తక్కువ మందిపై ప్రయోగాలు చేసిన విదేశీ కంపెనీలు అనుమతులు పొందాయన్నారు. భారత్‌ బయోటెక్‌ ఇప్పటివరకు 5 పబ్లికేషన్లు ఇచ్చిందని తెలిపారు.

భారతీయ కంపెనీలను తప్పుబట్టే ధోరణి ఉన్నందున కోవాక్సిన్ విమర్శలను ఎదుర్కొంటున్నట్లు డాక్టర్ కృష్ణ ఎల్లా పేర్కొన్నారు. భారతీయ కంపెనీలపై చాలా ఎదురుదెబ్బలు ఉన్నాయని.. ఇది తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ భారతీయ కంపెనీలను ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో తెలియదు అని ఆయన అన్నారు. ప్రస్తుతం 123 దేశాలకు తాము సేవలు అందిస్తున్నామని డాక్టర్ కృష్ణ తెలిపారు.


Tags

Read MoreRead Less
Next Story