PM Modi Security: ప్రధాని మోదీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? అసలు పంజాబ్‌ పర్యటనలో ఏం జరిగింది?

PM Modi Security: ప్రధాని మోదీ సెక్యూరిటీ ఎలా ఉంటుంది? అసలు పంజాబ్‌ పర్యటనలో ఏం జరిగింది?
PM Modi Security: ప్రధాని పర్యటన అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) మొత్తం పక్కా ప్లాన్ తో అడుగేస్తుంది.

PM Modi Security: దేశాన్ని నడిపించే అత్యున్నత హోదాలో ఉన్న ఓ వ్యక్తి.. అడుగేస్తే కనీసం ఓ అరడజను మంది ముందుగానే చెక్ చేయాలి.. ముందస్తు ప్రణాళికలు.. అడుగడుగునా ఆంక్షలు.. వెరసి ప్రధాని పర్యటన ఓ పెద్ద ప్రహసనం. పర్యటన నిర్విఘ్నంగా ముగిస్తే భద్రతా ఏజెన్సీలన్నీ ఊపిరిపీల్చుకుంటాయి. ప్రధాని పర్యటన అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) మొత్తం పక్కా ప్లాన్‌తో అడుగేయాల్సి ఉంటుంది.

ప్రధాని బయలుదేరిన దగ్గరి నుంచి గమ్యస్థానానికి చేరుకునేవరకు ఒళ్లంతా కళ్లు చేసుకుని కనిపెట్టుకుని ఉండాల్సిందే.. వాళ్ల డ్యూటీనే అది. మరి అలాంటిది బుధవారం జరిగిన ప్రధాని పంజాబ్ పర్యటనలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి ప్రధాని సెక్యూరిటీపై పడింది. ఆయన సెక్యూరిటీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో పెరిగింది.

బుధవారం (జనవరి 5) రైతుల నిరసన కారణంగా పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని ఫ్లైఓవర్‌పై ప్రధాని కాన్వాయ్ 15 నిమిషాలకు పైగా నిలిచిపోయింది. అలా ఎలా జరిగింది? పక్కా ప్లాన్‌తో ముందుకెళుతున్న పర్యటనలో సడెన్‌గా ఈ బ్రేక్ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు కాసేపు ఎవ్వరికీ. అంతలోనే అలెర్ట్ అయి ప్రధాని కాన్వాయ్ వెనుతిరిగింది.. ముందుగా అనుకున్న మీటింగ్ క్యాన్సి్ల్ అయింది.

అసలు ప్రధాని పర్యటనకు ముందు భద్రతా ప్రణాళిక ఎలా ఉంటుంది? ఏఏ ఏజెన్సీలు ఇందులో ఎలాంటి పాత్ర పోషిస్తాయి? ఒకవేళ ముందస్తు ప్రణాళికలో మార్పు జరిగితే ఏం చేస్తాయి?



ప్రధాని భద్రతను ఎలా ప్లాన్ చేస్తారు..

ప్రధాని పర్యటనకు సంబంధించిన భద్రతను ప్లాన్ చేయడంలో కేంద్ర సంస్థలతో పాటు రాష్ట్ర పోలీసు బలగాలు కూడా పాలుపంచుకుంటాయి. మూడు రోజుల ముందు నుంచే కసరత్తు చేస్తాయి. ప్రధాని భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) అధికారులు, ఇంటిలిజెన్స్ బ్యూరో (IB) అధికారులు.. ఈవెంట్‌లో పాల్గొనే ప్రతి ఒక్కరినీ స్కాన్ చేస్తారు. సంబంధిత రాష్ట్ర పోలీసు అధికారులతో పాటు, జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తమవుతుంది.

ప్రధాని టూర్‌కు సంబంధించి.. అవసరమైన భద్రతా ఏర్పాట్లపై ఎస్పీజీ అధికారులు చర్చలు జరుపుతారు. సమావేశం ముగిసిన తర్వాత నివేదిక తయారుచేస్తారు. దానిపై సమావేశానికి హాజరైన వారంతా సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ నివేదిక ఆధారంగా అన్ని భద్రతా ఏర్పాట్లు సక్రమంగా జరిగాయని తెలుస్తుంది.

సమావేశంలో ఏం చర్చిస్తారు

ప్రధానమంత్రి ఎలా వస్తారు (విమానం, రోడ్డు లేదా రైలు మార్గం ద్వారా...) అన్న విషయంతోపాటు.. ఆయన కార్యక్రమం జరిగే ప్రదేశానికి (సాధారణంగా హెలికాప్టర్ లేదా రోడ్డు ద్వారా..) ఎలా చేరుకుంటారనే దానిపై సమావేశం చర్చిస్తుంది. దీన్ని ప్లాన్ చేయడంలో, కేంద్ర ఏజెన్సీలు స్థానిక ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఇన్‌పుట్‌లను పరిగణనలోకి తీసుకుంటాయి.

సభ లేదా సమావేశ వేదిక భద్రతతోపాటు.. అక్కడి నుంచి వెళ్లడం ఇవన్నీ ముందుగానే ప్లాన్ చేస్తారు. వేదిక వద్దకు వచ్చే వారిని తనిఖీ చేయడంతో పాటు డోర్ ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్లను ఎక్కడ ఉంచాలి అన్న విషయాలను కూడా చర్చిస్తారు. వేదిక పటిష్టత ఎలా ఉందీ అన్న విషయాన్నీ పరిగణనలోకి తీసుకుంటారు. (బహిరంగ సభల్లో నాయకులు ఉండగానే వేదిక కూలిపోయిన సంఘటనల దృష్ట్యా ఈ అంశాన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటారు)

వేదికకు సంబంధించిన ఫైర్ సేఫ్టీ, ఆ రోజు వాతావరణ నివేదికను కూడా పరిశీలిస్తారు. ప్రధానమంత్రి ప్రయాణించే మార్గంలో పొదలు ఉంటే, వాటిని తొలగిస్తారు. ప్రయాణ మార్గం ఇరుకుగా ఉంటే అప్పటికప్పుడు వాటిని వెడల్పు చేయిస్తారు.



అకస్మాత్తుగా ప్రణాళిక మారితే ఏం జరుగుతుంది?

ఒకవేళ ప్రధాని టూర్ లో ఏవైనా అనుకోని మార్పులు జరిగితే ఎలా అన్న సందేహం వస్తుంది. దానికోసం మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా ముందుగానే ప్లాన్ చేసి ఉంచుతారు. అక్కడ కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తారు. చివరి నిమిషంలో సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడం సాధ్యపడదు. అందుకే ఈ ముందు జాగ్రత్తలు తప్పవు.

"SPG ప్రధానమంత్రికి సన్నిహిత భద్రతను మాత్రమే అందిస్తుంది. ప్రధానమంత్రి ఏదైనా రాష్ట్రానికి వెళ్లినప్పుడు, మొత్తం భద్రతను నిర్ధారించడం రాష్ట్ర పోలీసుల బాధ్యత. ఇంటెలిజెన్స్ సమాచారం, రూట్ క్లియరెన్స్, వేదికను శానిటైజ్ చేయడం.. ఈ పనులన్నింటికీ రాష్ట్రం బాధ్యత వహించాల్సి ఉంటుంది.



ప్రధాని భద్రతకు ఏదైనా ముప్పు వాటిల్లితే దానికి సంబంధించిన వివరాలను అందించాల్సిన బాధ్యత కేంద్ర నిఘా సంస్థలపై ఉంటుంది. అయితే, ప్రధానమంత్రి సెక్యూరిటీని ఎలా ఏర్పాటు చేయాలన్నది SPG నిర్ణయం మేరకే ఉంటుంది. స్థానిక పోలీసులు అనుమతి ఇచ్చే వరకు SPG.. ప్రధానమంత్రి పర్యటనకు సెక్యూరిటీ పరంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వదంటున్నాయి పోలీసు వర్గాలు

రాష్ట్ర పోలీసులు కూడా ప్రధాని పర్యటనలో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా చూస్తారు. రోడ్లపై మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఇళ్ల పైకప్పులపైనా సెక్యూరిటీ ఫోర్స్ నిఘా ఉంటుంది. రాష్ట్ర పోలీసులు ప్రధానమంత్రి కాన్వాయ్ కి నాయకత్వం వహించే పైలట్ వాహనాన్ని సమకూరుస్తారు. ప్రధానమంత్రి ఒక ప్రదేశంలో ఉండాల్సి వస్తే.. ఆయన భద్రతను పర్యవేక్షించడానికి పోలీసు సూపరింటెండెంట్ (SP) స్థాయి అధికారిని క్యాంపు కమాండెంట్‌గా నియమిస్తారు.

బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌షోలలో.. ప్రధాని.. జనసమూహానికి దగ్గరగా వెళ్లే సమయంలో మరిన్ని ప్రత్యేక జాగ్రత్తలు ఉంటాయి. అప్పుడు పోలీసులతో పాటు, ఇతర భద్రతా సిబ్బంది.. ప్రత్యేకంగా పర్యవేక్షిస్తారు. కొంతమంది మఫ్టీలో ఉంటారు.



రాజకీయ కార్యక్రమాలలో ప్రధానమంత్రి కూడా ప్రోటోకాల్ నుండి తప్పుకునేలా... ఆయన భద్రతా సిబ్బందిపై ఒత్తిడి ఉంటుంది. కానీ అలాంటి సమయాల్లో SPG ఒక స్టాండ్ తీసుకోవలసి ఉంటుంది. అక్కడ అందుకు అనుకూలమైన పరిస్థితులు లేకపోతే.. కచ్చితంగా ప్రధానికి అయినా సరే నో చెప్పాల్సి వస్తుంది. ఇది చాలా సున్నితమైన, కష్టతరమైన సమస్య. అయినా సరే ఎస్పీజీ దాని డ్యూటీ అది చేస్తుంది.

శీతాకాలంలో చాలా సార్లు, పొగమంచు కారణంగా ప్రధానమంత్రి హెలికాఫ్టర్‌ ప్రయాణం వాయిదా పడుతుంది. అటువంటి సమయంలో రోడ్డు మార్గం గుండా ప్రయాణించాల్సి వస్తుంది. అందుకే ఆ రూట్లను ముందుగానే ప్లాన్ చేసి ఉంచుతారు. ఏదైనా కారణం చేత రూట్ క్లియర్ గా లేదని తేలితే, రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వరు. అలాంటప్పుడు ఆ టూర్ రద్దవుతుంది.

ప్రధాని మోదీ కాన్వాయ్ కోసం కార్లను ఎవరు ఎంపిక చేస్తారు?

ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రధాని కాన్వాయ్‌లో భాగమైన వాహనాలతో పాటు ఆయన భద్రత వివరాలను స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) చూసుకుంటుంది. పీఎం సెక్యూరిటీ కోసం ఈ మధ్యనే కొత్త వాహనాన్ని కూడా తీసుకున్నారు. ఈ వాహనం పటిష్టమైన బాడీతోపాటు మందపాటి విండోస్‌ని కలిగి ఉంది. భద్రతకు ఏ మాత్రం ఢోకాలేని కాన్వాయ్ ఇది. AK-47 రైఫిల్స్ నుంచి, బుల్లెట్ల నుంచి తట్టుకునేలా స్పెషల్‌గా డిజైన్ చేశారు. దీని ఖరీదు రూ.12 కోట్లని ప్రచారం జరుగుతున్నా.. అంత ఖరీదు ఉండదంటున్నాయి అధికారవర్గాలు.


Tags

Read MoreRead Less
Next Story