అఫ్గన్‌ దేశ పౌరుల కోసం భారత్‌ కొత్త వీసా కేటగిరీ ఏర్పాటు..!

అఫ్గన్‌ దేశ పౌరుల కోసం భారత్‌ కొత్త వీసా కేటగిరీ ఏర్పాటు..!
అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు పూర్తిగా హస్తగతం చేసుకున్న నేపథ్యంలో... ఆ దేశంలో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి రప్పించడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు పూర్తిగా హస్తగతం చేసుకున్న నేపథ్యంలో... ఆ దేశంలో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి రప్పించడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ దేశంలో చిక్కుకున్న భారతీయుల్ని స్వదేశానికి రప్పించడంపై చర్చించారు. మరోవైపు... అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజలందరికీ క్షమాభిక్ష ప్రసాదిస్తున్నామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరాలని ఆదేశించారు.

అఫ్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం మూతపడలేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆ దేశంలోని భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. 1650 మంది స్వదేశానికి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. ఇప్పటికే కాబూల్‌ నుంచి 120 మందితో విమానం భారత్‌ చేరుకుందని ప్రకటించింది. అఫ్గనిస్తాన్‌లో తాజా పరిస్థితిపై చర్చించేందుకు సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ... తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశానికి హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. అఫ్గనిస్తాన్‌లోని ఎంబసీని మూసివేయలేదని వెల్లడించింది.

అఫ్గాన్‌ ఆక్రమణల్లో తాలిబన్లు ఈ సారి తమ సహజ వైఖరికి విరుద్ధంగా శాంతి మంత్రం జపించారు. ఎక్కడా విధ్వంసానికి తెగబడలేదు. తమ ఆక్రమణతో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎవరికీ హాని తలబెట్టబోమంటూ భరోసా ఇచ్చారు. అనుమతి లేకుండా ఎవరి ఇళ్లలోకి ప్రవేశించొద్దంటూ ఫైటర్లను ఆదేశించామని.. ప్రజల ప్రాణాలు, ఆస్తులు, గౌరవాన్ని పరిరక్షించాల్సిందిగా సూచనలు జారీ చేశామని తాలిబన్ల అధికార ప్రతినిధి సుహైల్‌ షహీన్‌ ట్విటర్‌ వేదికగా తెలిపారు. అమెరికా నేతృత్వంలోని కూటమి తరఫున పనిచేసిన వారిపై తామేమీ ప్రతీకారం తీర్చుకోబోమని తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ హామీ ఇచ్చారు. అఫ్గాన్‌ ప్రజల్లో అనవసర భయాందోళనలg రేకెత్తించవద్దని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.

తాలిబన్ల ఆక్రమణతో అఫ్గానిస్థాన్‌లో కల్లోలం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశ పౌరుల కోసం భారత్‌ కొత్త వీసా కేటగిరీని ఏర్పాటు చేసింది. అఫ్గాన్ల దరఖాస్తులను వేగంగా పరిశీలించేందుకు ఈ-ఎమర్జెన్సీ వీసాలను ప్రకటించింది. అఫ్గాన్‌ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వీసా నిబంధనలపై కేంద్ర హోంశాఖ సమీక్ష చేపట్టి నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ కొత్త కేటగిరీతో ఎలాంటి మతపరమైన ప్రాధాన్యత లేకుండా అఫ్గాన్‌లోని ప్రతి ఒక్కరు వీసాకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నట్టు పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story