జార్ఖండ్‌లో జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ మరణంపై వివాదం..!

జార్ఖండ్‌లో జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ మరణంపై వివాదం..!
నిన్న ఉదయం ధన్‌బాద్‌లో మార్నింగ్‌ వాకింగ్‌కి వెళ్లిన జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ను ఓ టెంపో ఢీ కొట్టింది.

జార్ఖండ్‌లో జడ్జి ఉత్తమ్‌ ఆనంద్‌ హత్యకు గురవడం సంచలనం సృష్టించింది. నిన్న ఉదయం ధన్‌బాద్‌లో మార్నింగ్‌ వాకింగ్‌కి వెళ్లిన జస్టిస్‌ ఉత్తమ్‌ ఆనంద్‌ను ఓ టెంపో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ఆయన.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ముందు ఇది అనుకోకుండా జరిగిన హిట్ అండ్ రన్‌ అనే భావించినా దీనికి సంబంధించిన వీడియో ఫుజేట్‌ పరిశీలించాక జడ్జిని ప్లాన్‌ ప్రకారమే చంపారనే అనుమానాలు బలపడ్డాయి. ఈ నేపథ్యంలో దీనిపై పూర్తిస్థాయిలో పోలీసులు విచారిస్తున్నారు.

స్థానికంగా ఉన్న గ్యాంగ్‌స్టర్లకు ఓ కేసులో బెయిల్ నిరాకరించినందుకే కక్షకట్టి జడ్జిని చంపేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అటు, ఈ హత్య ఘటనపై బార్ అసోసియేషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించి సుమోటోగా విచారణ చేపట్టాలని కోరింది. దీనిపై స్పందించిన సుప్రీం చీఫ్ జస్టిస్‌ NV రమణ తాను జార్జండ్‌ CJతో తాను మాట్లాడానని చెప్పారు. ఈ దశలో విచారణలో జోక్యం చేసుకోవడం లేదని, కేసు పురోగతిని ఎప్పటికప్పుడు తాము తెలుసుకుంటామని వివరించారు. అటు.. జడ్జిని మర్డర్ చేయడం న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా చెప్తూ CBI విచారణ జరిపించాలనే డిమాండ్ వచ్చినా ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు వాకింగ్ కోసం డిస్ట్రిక్ట్ అండ్ అడిషనల్‌ జడ్జ్‌ ఆనంద్ బయటకు వెళ్లారు. ఇంటి నుంచి అరకిలోమీటరు దూరం వెళ్లారో లేదో ఇంతలో ఓ టెంపో వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. కాసేపటికి అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి జడ్జిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో చేర్చినా తీవ్రగాయాల కారణంగా ఆయన ప్రాణాలు కోల్పోయారు. అటు, ఈ యాక్సిడెంట్ చేసేందుకు ఉపయోగించిన ఆటో కూడా చోరీకి గురైందే కావడం గమనార్హం. ఈ కేసు విచారణలో భాగంగా ఓ డ్రైవర్‌ను, మరో ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ధన్‌బాద్‌ ప్రాంతంలో ఇల్లీగల్‌ మాఫియాకి సంబంధించిన అనేక కేసుల విచారణ ప్రస్తుతం ఆనంద్ టేబుల్‌పైనే ఉంది. వాళ్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనేది తేలాల్సి ఉంది.

Tags

Read MoreRead Less
Next Story