శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ సూసైడ్‌.. కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం

శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ సూసైడ్‌.. కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం
సభాపతి స్థానంలో ఉన్న ధర్మెగౌడను కాంగ్రెస్‌ సభ్యులు ఛైర్మన్ సీటు నుంచి లాక్కెళ్లారు. ఈ పరిణామం ఒక్కసారిగా ఘర్షణకు దారి తీసింది.

కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్, జేడీఎస్ ఎమ్మెల్సీ ధర్మెగౌడ సూసైడ్‌ చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది..చిక్కమగళూరు జిల్లా కదుర్ తాలుకా గుణసాగర్​ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆయన మృతదేహం గుర్తించారు. సోమవారం సాయంత్రం ధర్మెగౌడ ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. ఆయన కోసం గన్​మెన్, పోలీసులు గాలించినా ఆచూకీ లభ్యంకాలేదు. మంగళవారం వేకువజామున 2గంటల సమయంలో ధర్మెగౌడ డెడ్‌బాడీని రైల్వే ట్రాక్ పక్కన గుర్తించారు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఘటనాస్థలిలో పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సోమవారం సాయంత్రం సమయంలో సుకరాయపట్నంలోని తన ఇంటి నుంచి బయల్దేరిన ధర్మెగౌడ.. కారును రైల్వే ట్రాక్ సమీపంలో నిలపాలని డ్రైవర్‌కు సూచించారు. అక్కడ నుంచి డ్రైవర్ పంపేశారు. ఓ వ్యక్తికి ఫోన్ చేసి జన శతాబ్ది రైలు ఎప్పుడొస్తుందని ఆరా తీశారు.. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసినట్లు తెలుస్తోంది...ధర్మెగౌడ ఆత్మహత్య పట్ల ప్రధాని మోదీ, జేడీఎస్ అధినేత దేవెగౌడ, జేడీఎస్‌ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ధర్మెగౌడ మరణం కర్ణాటకకు తీరని లోటని అన్నారు. అటు నా మిత్రుడు నన్ను విడిచిపెట్టి వెళ్లిపోయాడు అంటూ కన్నీటి పర్యంతం అయ్యారు మాజీ సీఎం కుమారస్వామి. ఇది ఆత్మహత్య కాదని రాజకీయ హత్యే అని ఆరోపించారు.

ఇటీవల మండలిలో చోటుచేసుకున్న పరిణామంతో డిప్యూటీ ఛైర్మన్ ధర్మగౌడ తీవ్ర మనస్థాపానికి గురయినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 15న కర్ణాటక విధాన పరిషత్ సమావేశాల్లో రసాభాస జరిగింది. ఛైర్మన్ కే ప్రతాపచంద్ర శెట్టిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా సభ్యులు వాగ్వాదాలకు దిగారు. ఒకరినొకరు తోసుకున్నారు. సభాపతి స్థానంలో ఉన్న ధర్మెగౌడను కాంగ్రెస్‌ సభ్యులు ఛైర్మన్ సీటు నుంచి లాక్కెళ్లారు. ఈ పరిణామం ఒక్కసారిగా ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనతో ధర్మెగౌడ తీవ్రమనస్థాపం చెందినట్లు తెలుస్తోంది.

శాసనమండలిలో గోవధ నిషేధ బిల్లును ఆమోదించుకోవాలని బీజేపీ ప్రభుత్వం భావించింది. విధానసభలో బీజేపీకి మెజార్టీ ఉన్నా.. పరిషత్తులో కాంగ్రెస్‌కు ఆధిపత్యం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ మరో నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. అయినా.. కాంగ్రెస్‌కే మెజార్టీ ఉంది. దీంతో జేడీఎస్‌ను మచ్చికచేసుకుని బిల్లును ఆమోదించుకోవాలని బీజేపీ పావులు కదిపింది. జేడీఎస్‌కు చెందిన డిప్యూటీ ఛైర్మన్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తారని అనుమానించిన కాంగ్రెస్ సభ్యులు ఆయనను కుర్చిలోనుంచి లాగేశారు. ఈ ఘటన తర్వాత మనస్థాపం చెందిన ధర్మెగౌడ ఏకంగా సూసైడ్ చేసుకోవడం కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story