స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎం విజయన్ పాత్ర ఉంది : స్వప్న సురేష్

స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎం విజయన్ పాత్ర ఉంది : స్వప్న సురేష్
స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎం విజయన్ పాత్ర ఉందని నిందితురాలు స్వప్న సురేష్ బాంబు పేల్చారు

కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ గోల్డ్ స్కామ్ కేసు ప్రకంపనలు రేపుతోంది. గోల్మ్ స్మగ్లింగ్ కేసు సీఎం పినరయి విజయన్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న స్వప్న సురేష్ కస్టమ్స్ విచారణలో సంచలన విషయాలు చెప్పారు. స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎం విజయన్ పాత్ర ఉందని నిందితురాలు స్వప్న సురేష్ బాంబు పేల్చారు. సీఎంతో పాటు ముగ్గురు మంత్రులు, స్పీకర్ పాత్ర కూడా ఉందని కస్టమ్‌ విచారణలో వెల్లడించారు. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా హైకోర్టుకు నివేదిక సమర్పించారు కస్టమ్స్ అధికారులు.

కేరళ సీఎం పినరయి విజయన్, యూఏఈ కాన్సులేట్ జనరల్ మధ్య జరిగిన చర్చల్లో స్వప్న సురేష్ మధ్యవర్తిగా ఉన్నారని కస్టమ్స్ అధికారులు తెలిపారు. సీఎం విజయన్‌కు అరబిక్ భాష మాట్లాడ్డం, అర్థం చేసుకోవడం రానందున.. స్వప్న సురేష్ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. చేసుకున్న ఒప్పందం ద్వారా ముఖ్యమంత్రితో పాటు మంత్రులకు భారీగా కమీషన్లు ముట్టాయని స్వప్న సురేష్ చెప్పినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.

సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ గోల్డ్‌ స్మగ్లింగ్ కేసులో సీఎం పాత్ర బయటకు రావడంతో ప్రతిపక్షాలకు కస్టమ్స్ అధికారుల స్టేట్‌మెంట్ ఒక ఆయుధంగా మారింది. కేరళలో పాగా వేయాలని చూస్తున్న కాంగ్రెస్, బిజెపిలకు గోల్డ్ స్కామ్ ఒక అస్త్రంగా మారింది. పినరయి ప్రభుత్వంపై బిజెపి నేతలు మండిపడుతుండగా.. గతంలో తాము చేసిన ఆరోపణలన్నీ నిజమయ్యాయని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story