ట్యాక్సీ డ్రైవర్‌కి జాక్‌పాట్.. లాటరీలో రూ.40 కోట్లు

ట్యాక్సీ డ్రైవర్‌కి జాక్‌పాట్.. లాటరీలో రూ.40 కోట్లు

మూడేళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నాడు. ఎప్పుడో ఒకప్పుడు తగలక పోతుందా.. అదృష్టం పండకపోతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఓ ఫైన్ మార్నింగ్ ఫోన్ మోగింది. ఒకటీ రెండు కాదు ఏకంగా రూ.40 కోట్లు లాటరీలో గెలుచుకున్నారని మెసేజ్ వచ్చింది. తన అదృష్టానికి ఉబ్బితబ్బిబ్బవుతున్నారు కేరళకు చెందిన రంజిత్ సోమరాజన్.

యుఎఇలో జరిగిన ర్యాఫిల్ డ్రాలో 37 ఏళ్ల భారతీయ వ్యక్తి, వివిధ దేశాలకు చెందిన అతని తొమ్మిది మంది సహచరులు కలిసి లాటరీ టికెట్ కొన్నారు. ఇప్పుడు వాళ్లంతా 20 మిలియన్ దిర్హామ్ (సుమారు రూ .40 కోట్లు) గెలుచుకొని జాక్‌పాట్ కొట్టారు.

కేరళకు చెందిన రంజిత్ సోమరాజన్ అబుదాబిలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గత మూడేళ్లుగా అతడు లాటరీ టికెట్లు కొంటున్నాడు. ఇప్పటికి అదృష్టం వరించింది. నేను జాక్‌పాట్‌ను కొడతానని ఎప్పుడూ అనుకోలేదు.

నేను 2008 నుండి ఇక్కడ ఉన్నాను. దుబాయ్‌లో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. గత సంవత్సరం ఒక సంస్థలో డ్రైవర్-కమ్-సేల్స్ మాన్ గా పనిచేశాను. కాని నా జీతం తక్కువగా ఉండడంతో జీవితం కష్టంగా సాగేదని సోమరాజన్ తెలిపారు.

మేము మొత్తం 10 మంది స్నేహితులం వివిధ దేశాలనుంచి వచ్చిన వాళ్లంతా కలిసి ఒకే చోట ఉంటున్నాం. భారతదేశం, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి వివిధ దేశాలకు చెందినవారమైనా అందరం కష్ట సుఖాల్ని కలిసే పంచుకుంటాం. నేను ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తుంటే వారంతా ఒక హోటల్ వాలెట్ పార్కింగ్లో పనిచేస్తారు. మేమంతా కలిసి రెండు లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తే ఒకటి ఉచిత ఆఫర్ కింద వచ్చింది. లాటరీ టికెట్లు కొనడం కోసం ఒక్కొక్కరం 100 దిర్హామ్‌లను ఖర్చు చేవాము.

జూన్ 29 న టికెట్ నా పేరు మీద తీసుకోబడింది. ఈసారి నీ పేరు మీద లాటరీ టికెట్ కొందాము. నీ అదృష్టం ఎలా ఉందో చూద్దామని స్నేహితులు అనడంతో సరేనన్నాను. నన్ను అదృష్ట వరిస్తుందని, నాకు లాటరీ తగులుతుందని బలంగా నమ్మాను. సర్వశక్తిమంతుడు దేవుడు ఒక రోజు నన్ను ఆశీర్వదిస్తాడని నేను ఎప్పుడూ అనుకునేవాడిని అని రంజిత్ చెప్పాడు. ఇప్పుడు తనకు వచ్చిన మొత్తాని మిగిలిన 9మంది స్నేహితులతో కలిసి పంచుకున్నాడు. మేమంతా మెరుగైన జీవితాలు గడుపుతాం అని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ పది మంది స్నేహితులు.

Tags

Read MoreRead Less
Next Story