యువతి ప్రాణం తీసిన చీమలు..

యువతి ప్రాణం తీసిన చీమలు..
చీమలు ఇబ్బంది పెడుతున్నాయని భావించిందే కానీ అవే చీమలు తన ప్రాణాలు తీస్తాయని అనుకోలేదు.

ఇంట్లో బారులు తీరిన చీమలు ఇబ్బంది పెడుతున్నాయని భావించిందే కానీ అవే చీమలు తన ప్రాణాలు తీస్తాయని అనుకోలేదు. చీమలకు నిప్పుపెట్టబోయే అవే మంటల్లో ఆమె కాలిపోయింది. తమిళనాడులోని అమింజికరై పట్టణంలోని పెరుమాల్ కోయిల్ స్ట్రీట్‌లో నివసిస్తున్న ఎస్. సంగీత (27) అనే యువతి, షోలింగా నల్లూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగిగా పని చేస్తోంది. తండ్రి లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

లాక్‌డౌన్ కారణంగా అతడు ఉపాధి కోల్పోయాడు. ఇంట్లోనే ఉంటున్నాడు.. కూతురి సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది. ఇంటి నుంచే పని చేస్తున్న సంగీతకు ఇంట్లో పుట్టలు పెట్టిన చీమలు చిరాకు తెప్పించాయి. దీంతో వాటి పని పట్టాలని భావించింది. అమ్మతో కలిసి ఆదివారం రోజు గదిని శుభ్రం చేసింది. చీమల పుట్టని ధ్వసం చేస్తే తప్ప వాటి నుంచి విముక్తి లభించదనుకుంది. చీమల పుట్టపై మంటపెట్టే నిమిత్తం పేపర్పై కిరోసిన్ పోసి అగ్గిపుల్ల వెలిగించింది.

చీమలు మంట వేడికి తాళలేక అటు ఇటు పరిగెడుతూ ఆమె మీద కూడా కొన్ని పడ్డాయి. వాటిని దులుపుకునే క్రమంలో ఆమెపై కిరోసిన్ పడింది. క్షణంలో ఆమెను అంటుకున్న మంట దావానంలా వ్యాపించింది. ఆమె తల్లికి కూడా మంటలు అంటుకున్నాయి కానీ స్వల్ప గాయాలతో బయటపడింది. తీవ్రంగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన యువతి చికిత్స పొందుతూ మరణించింది.

Tags

Read MoreRead Less
Next Story