మహారాష్ట్రలో మళ్లీ లాక్‌ డౌన్‌?

మహారాష్ట్రలో మళ్లీ లాక్‌ డౌన్‌?
వారం రోజులు బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా అక్కడ 30వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో పాక్షిక లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ.. వైరస్ అదుపులోకి రాకపోవడంతో లాక్‌డౌన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక ఇబ్బందులు, ప్రజలకు మౌలిక వసతులకు ఇబ్బందులు లేకుండా కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి ఉద్ధవ్ ఠాక్రే 8.30 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రసంగంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే.. మళ్లీ లాక్​డౌన్​ప్రకటన చేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఆర్థిక ప్రభావం లేకుండా లాక్‌డౌన్ విధించే సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని అధికారులను ఠాక్రే ఇప్పటికే ఆదేశించడం దీనికి బలం చేకూర్చుతోంది.

మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో పుణెలో రేపు సాయంత్రం 6గంటల నుంచి ఉదయం 6గంటల వరకు 12గంటల పాటు వారం రోజుల పాటు నైట్ కర్ఫ్యూని విధిస్తున్నట్లు పూణే డివిజినల్ కమిషనర్ సౌరభ్ రావ్ తెలిపారు. వారం రోజులు బార్లు, హోటళ్లు, రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. హోం డెలివరీ మాత్రం కొనసాగించవచ్చన్నారు. అంత్యక్రియలు, వివాహ వేడుకలు మినహా మరే ఇతర ఫంక్షన్లకు అనుమతి లేదని చెప్పారు.

ఇక శుక్రవారం కూడా మహారాష్ట్రలో కరోనా కేసులు సంఖ్య 40వేలు దాటింది. 24 గంటల్లో 43వేల 183 మందికి కరోనా సోకగా.. 249 మంది మృత్యువాత పడ్డారు. అలాగే ఒక్క ముంబైలోనే 8వేల 646 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గత నాలుగు నెలల్లో ముంబైలో అత్యధిక కేసులు రావడం ఇదే తొలిసారి.

మరోవైపు మధ్య ప్రదేశ్‌లోనూ ప్రభుత్వం కఠిన ఆంక్షలు అముల చేస్తోంది. కరోనా ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్‌డౌన్ అమలుచేస్తోంది. ఛింద్వాడా జిల్లా, రత్లాం నగరాల్లో గురువారం రాత్రి నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఇవాళ రాత్రి 10 గంటల నుంచి బైతూల్ జిల్లా, ఖర్గోన్ లోని పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ అమలు కానుంది. ఈ ప్రాంతాల్లో రేపు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి.


Tags

Read MoreRead Less
Next Story