గుడ్‌జాబ్.. కారుని అమ్మడం.. కొట్టేయడం

గుడ్‌జాబ్.. కారుని అమ్మడం.. కొట్టేయడం
ఈ లోపు తన పనిని చక్కబెట్టాడు త్యాగి. పథకం ప్రకారం కారుని దొంగిలించాడు.

కారుని అమ్మినట్టే అమ్మడం.. వెంటనే కొట్టేయడం.. దొరికినప్పుడు చూద్దాం.. అప్పుడుదాకా రాజాలా బతికేద్దాం అనుకున్నాడు ఢిల్లీ నోయిడాకు చెందిన వ్యక్తి. ఏం తెలివిరా భయ్.. అన్ని రోజులు మనవి కావు.. అడ్డంగా బుక్కయ్యాడు ఓ ఫైన్ మార్నింగ్ పోలీసుల చేతికి చిక్కాడు. ఉత్తరప్రదేశ్‌ నోయిడాలోని అమ్రోహాకు చెందిన మనోత్తమ్ త్యాగి అనే వ్యక్తి ఈ కామర్స్ సైట్లలో తన మారుతీ స్విప్ట్ వీహెచ్‌ఐని అమ్మకానికి పెట్టాడు.

ఆ ప్రకటన చూసిన జీతే యాదవ్ అనే వ్యక్తి త్యాగిని సంప్రదించాడు. రూ. 2,60,000 బేరం కుదుర్చుకున్నాడు. అనంతరం తన కారును యాదవ్‌కు అప్పగించాడు త్యాగి. అయితే ఒరిజినల్ రిజిస్ట్రేషన్ పేపర్లు, రెండవ కీని తరువాత ఇస్తానని అతనికి చెప్పాడు. యాదవ్ కూడా సరే.. అవి ఇచ్చిన తరువాతే మిగిలిన డబ్బు ఇస్తానంటూ రూ.2,10,000లు త్యాగి చేతిలో పెట్టాడు.

మరుసటి రోజు కొనుగోలు చేసిన కారు వేసుకుని ఆఫీసుకు వెళ్లాడు. ఆఫీస్ గేటు ముందు పార్క్ చేసి లోపలికి వెళ్లి పని పూర్తి చేసుకుని బయటకు వచ్చాడు. ఈ లోపు తన పనిని చక్కబెట్టాడు త్యాగి. పథకం ప్రకారం కారుని దొంగిలించాడు. పని పూర్తయ్యాక బయటకు వచ్చి చూసుకున్న యాదవ్‌కు పార్కింగ్ స్థలంలో ఉంచిన కారు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా త్యాగిని పట్టుకున్నారు.

అదుపులోకి తీసుకున్న పోలీసులు త్యాగిని విచారించగా.. కారుని అమ్మి తిరిగి తానే దొంగిలించేవాడినని ఒప్పుకున్నాడు. ఆ విధంగా ఇదే కారుని 7 సార్లు అమ్మానని చెప్పాడు. కారులో అమర్చిన జీపీఎస్ ఆధారంగా ఎక్కడ పార్క్ చేశారో తెలుసుకుని కారుని దొంగిలించే వాడినని పోలీసులకు వివరించాడు. అతడి వద్ద నుంచి కారు, మొబైల్ ఫోన్లు, నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, కొంత నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనతరం అతడిని కటకటాల వెనక్కు పంపించారు.

Tags

Read MoreRead Less
Next Story