పశ్చిమ బెంగాల్లో భారీగా పెరిగిన కరోనా కేసులు

పశ్చిమ బెంగాల్లో భారీగా పెరిగిన కరోనా కేసులు
పశ్చిమ బెంగాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో బెంగాలీలు ఉలిక్కిపడ్డారు. ఉన్నట్టుండి ఒకేసారి పాజిటివ్ కేసుల సంఖ్య 15 రెట్లు పెరిగింది.

పశ్చిమ బెంగాల్లో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో బెంగాలీలు ఉలిక్కిపడ్డారు. ఉన్నట్టుండి ఒకేసారి పాజిటివ్ కేసుల సంఖ్య 15 రెట్లు పెరిగింది. మార్చి 11 వరకు 3 వేల 110 యాక్టివ్‌ కేసులున్న బెంగాల్లో ఇప్పుడు 53 వేలకు చేరాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే దీనికి బెంగాల్లో జరుగుతున్న ఎన్నికల భారీ ప్రచార సభలు, ర్యాలీలే కారణం అనే విమర్శలున్నాయి. బెంగాల్లో మొత్తం 8 దశల పోలింగ్ జరగాల్సి ఉండగా... ఇప్పటిదాకా ఐదు దశల పోలింగ్ పూర్తయింది.

అన్ని పార్టీల నేతలు పోటీపడి మరీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారీ బహిరంగ సభలు, రోడ్‌షోలు, ర్యాలీలు చేపట్టారు. వీటికి వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. భౌతిక దూరం అస్సలు కనిపించలేదు. చాలామంది మాస్కులు ధరించడం వంటి నిబంధనలు అస్సలు పాటించలేదు. ఇక శానిటైజర్ల వాడకం కూడా పట్టించుకోలేదు. పోలింగ్ సమయంలో మాత్రం అధికారులు ఓటర్లకు థర్మల్ స్క్రీనింగ్, భౌతికదూరం పాటించడం, శానిటైజర్లు వంటి కొవిడ్ నిబంధనలు అమలు చేశారు. కానీ ఎన్నికల ప్రచారంలో మాత్రం అవేవీ కనిపించలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రచారంలోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.

ఎన్నికల ప్రచార సభల్లో చాలామంది నేతలు మాస్కులు కూడా ధరించకుండా కనిపించారు. మరి కార్యకర్తలకు వీరిచ్చే సందేశం ఏంటనే విమర్శలు వెల్లువెత్తాయి. దేశంలో సెకండ్‌ వేవ్ సునామీ సృష్టిస్తుండడంతో కొందరు నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోమని ప్రకటించారు. అయితే ద్వితీయ స్థాయి నేతలు ప్రచారంలో పాల్గొంటుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెంగాల్ ఎన్నికల ప్రచార సభలు, ర్యాలీల్లో పాల్గొనబోనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.

కానీ అదే పార్టీకి చెందిన నేత అధిర్ రంజన్ మాత్రం ఓ భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక ప్రత్యర్థులు కొవిడ్‌ను రాష్ట్రంలో వ్యాప్తి చేస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. కానీ ఆమె కూడా వేలాది మందితో సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు అన్ని పార్టీల నేతలు పోటీపడి నిర్వహించిన సభలు, ర్యాలీల ఫలితంగా కొవిడ్ ఒక్కసారిగా విజృంభిస్తోందని బెంగాల్ వాసులు వాపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story