నేతల కేసుల పరిష్కారం విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

నేతల కేసుల పరిష్కారం విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

నేరచరిత గల నేతల కేసుల పరిష్కారం విషయంలో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది..వారం రోజుల్లోగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని హైకోర్టులకు సూచించింది. స్టే ఉన్న కేసులను కూడా 2 నెలల్లో కొలిక్కి తీసుకురావాలని స్పష్టం చేసింది. నిర్దిష్ట కాలవ్యవధిలో కేసులను తేల్చాలని చెప్పింది. ప్రస్తుత మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలపైన కేసుల విచారణకు..ప్రతి జిల్లాలో ఒక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని సూచించింది సుప్రీం. ఏడాదిలోనే ట్రయల్ పూర్తయ్యేందుకు హైకోర్టులు బ్లూప్రింట్ ప్రిపేర్ చేయాలిని తెలిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టి..యాక్షన్ ప్లాన్‌ రూపొందించాలని సూచించింది అత్యున్నత న్యాయస్థానం.

యాక్షన్‌ ప్లాన్‌లో 9 అంశాలను చేర్చాలని వివరించింది. ప్రతి జిల్లాలోని పెండింగ్‌ కేసులు, ప్రత్యేక కోర్టుల సంఖ్య..అందుబాటులో ఉన్న కోర్టులు, జడ్జిల సంఖ్య, పదవీ కాలం, ప్రతి న్యాయమూర్తి ఎన్ని కేసులు పరిష్కరించగలరో.. పరిష్కారానికి పట్టే సమయాన్ని పొందుపర్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టుల మధ్య దూరం, మౌలిక సదుపాయాలను కూడా యాక్షన్‌ ప్లాన్‌లో చేర్చాలని సూచించింది. అమికస్‌ క్యూరీ ఇచ్చిన సిఫార్సులపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌లు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరింది. అమికస్‌ క్యూరీకి ఈమెయిల్‌ ద్వారా యాక్షన్‌ ప్లాన్‌ పంపాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

రాజకీయ నాయకులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగంగా పూర్తి చేయాలని, శిక్షపడిన నాయకులను జీవితాంతం ఎన్నికల నుంచి బహిష్కరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని బీజేపీకి చెందిన న్యాయవాది అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ పిటిషన్ వేశారు. దీనిపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. దేశ వ్యాప్తంగా ఉన్న పెండింగ్‌ కేసుల గురించి అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా ఇదివరకే సుప్రీం కోర్టుకు తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం.... దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులపై 4 వేల 442 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీలపైనే 2 వేల 556 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక ఇతర ప్రజాప్రతినిధులపై మరో 266 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు బుధవారం నాటి అనుబంధ నివేదికలో వెల్లడించారు.

పెండింగ్‌లో ఉన్న కేసుల్లో అత్యధికంగా అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్, ఫోక్సో చట్టం కింద నమోదయ్యాయి. ఇక ఆదాయపు పన్ను కంపెనీలు, ఆయుధ చట్టాల కింద మరో 12 అభియోగాలు ఉన్నాయి. కేసు దర్యాప్తుపై స్టే విధిస్తే ఆ కేసును రెండు వారాల్లో మళ్లీ విచారణకు వచ్చేలా.... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు సిఫార్సు చేయాలని అమికస్ క్యూరీ కోరారు. మరోవైపు అమికస్ క్యూరీ చేసిన సూచనల అమలుకు అభ్యంతరం లేదని సొలిసిటర్ జనరల్ తుషార్ హెహతా తెలిపారు. అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. దీంతో నేరచరిత గల నేతల కేసుల పరిష్కారానికి వారం రోజుల్లోగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని హైకోర్టులకు సూచించింది సుప్రీం ధర్మానసం.

Tags

Read MoreRead Less
Next Story