Kerala : వచ్చే మూడు నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. !

Kerala : వచ్చే మూడు నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు.. !
భారత వాతావరణ శాఖ కేరళను భయపెట్టే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. వచ్చే మూడు నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని చెప్పింది.

భారత వాతావరణ శాఖ కేరళను భయపెట్టే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. వచ్చే మూడు నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడతాయని చెప్పింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడొచ్చని హెచ్చరించింది. ఇప్పటి వరకు కురిసిన వర్షాలకే కేరళలో 26 మంది చనిపోయారు. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిస్సూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. కేరళ, కర్నాటక, లక్షద్వీప్‌ వైపు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ మధ్యాహ్న వరకు అలల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.

శుక్రవారం నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కేరళ అతలాకుతలం అయింది. ముఖ్యంగా కొట్టాయం, ఇడుక్కి జిల్లాలలో వరదల ధాటికి కొండ చరియలు విరిగి ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వరదల్లో పలువురు గల్లంతు కాగా, వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగడంతో అనేక ప్రాంతాల్లో ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. రిజర్వాయర్లలో నీటిమట్టాలు గరిష్ట స్థాయికి చేరాయి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో శబరిమల దర్శనానికి ఎవరూ రావొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేరళలో వర్షాలు, వరదల కారణంగా 26 మంది మృతి చెందడంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. కేరళలో పరిస్థితులపై సీఎం పినరయి విజయన్‌తో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.

కేరళకే కాదు.. రాబోయే మూడు రోజుల్లో దేశంలోని 20 రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాయువ్య, ఈశాన్య, ద్వీపకల్పంలోని పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఇవాళ్టి నుంచి 20వ తేదీ వరకు నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కర్నాటక, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీవర్షాలు కురవవచ్చని వాతావరణశాఖ వివరించింది.

బంగాళాఖాతం నుంచి బలమైన గాలులు వీస్తున్నందున భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ తెలిపింది. ఇక జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకూ భారీవర్ష సూచన ఉందంటూ ఐఎండీ బులెటిన్ విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్, హర్యానా, చండీగఢ్‌లలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story