ముకేశ్ అంబానీకి బెదిరింపుల లేఖ కేసులో మరో ట్విస్ట్

ముకేశ్ అంబానీకి బెదిరింపుల లేఖ కేసులో మరో ట్విస్ట్
అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం పార్క్ చేసిన కేసులో మరో ట్విస్ట్ చేసుకుంది.

ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాలతో నిండిన వాహనం పార్క్ చేసిన కేసులో మరో ట్విస్ట్ చేసుకుంది. ఆ వాహన యజమాని మాన్‌సుఖ్ హిరేన్ శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హిరేన్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే హిరేన్ కుటుంబ సభ్యులు మాత్రం ఆత్మహత్య కాదని చెబుతున్నారు. గురువారం రాత్రి అతడు ముంబై శివారులోని విరార్‌లోనే ఉన్నాడని పేర్కొన్నారు.

హిరేన్ తన భవనంలో చిన్నారులకు ఈతలో శిక్షణ ఇస్తుంటాడని స్థానికులు తెలిపారు. హిరేన్ మృతదేహాన్ని ముంబై క్రీక్ నుంచి స్వాధీనం చేసుకున్నామని, శరీరంపై ఎలాంటి గాయాలు లేవని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. అయితే, హిరేన్‌ మృతిపై ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్, జాయింట్ కమిషనర్ మిలింద్ స్పందించేందుకు నిరాకరించారు. ఉన్నతాధికారులు మాత్రం హిరేన్‌ది ఆత్మహత్యేనని ధ్రువీకరించారు.

గత నెల 25న ముకేశ్ అంబానీ నివాసమైన అంటిలియా సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన స్కార్పియో వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వాహనం నుంచి క్వారీలలో పేలుడు ఉపయోగించే జిలెటిన్ స్టిక్స్‌తో పాటు అంబానీ కుటుంబాన్ని హెచ్చరిస్తూ ఉన్న లేఖను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఆ స్కార్పియో వాహనం మాన్‌సుఖ్ హిరేన్‌దని తేలింది.

ఏడాదికిపైగా తన కారు ఉపయోగంలో లేదని, దానిని విక్రయించే ఉద్దేశంతో ఇటీవలే దానిని బయటకు తీసినట్టు విచారణలో హిరేన్ వెల్లడించాడు. ఫిబ్రవరి 16న తన కారును ములుంద్-ఎయిరోలి లింక్ రోడ్డులో పార్క్ చేశానని, ఆ తర్వాతి రోజు వచ్చి చూస్తే అది కనిపించలేదని తెలిపాడు. కేసు దర్యాప్తులో ఉండగానే హిరేన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది.


Tags

Read MoreRead Less
Next Story