Narendra Modi: అత్యవసర యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా.. దేశంలోనే మొదటిసారి..

Narendra Modi (tv5news.in)

Narendra Modi (tv5news.in)

Narendra Modi:యుద్ధవిమానాలు దిగేందుకు వీలుగా పూర్వాంచల్ లో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు

Narendra Modi: అత్యవసర సమయాల్లో రహదారులపైనే యుద్ధవిమానాలు దిగేందుకు వీలుగా ఉత్తర్ ప్రదేశ్ లోని పూర్వాంచల్ లో నిర్మించిన ఇంజనీరింగ్ అద్భుతాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఇండియన్‌ ఆర్మీకి చెందిన సి-130జె సూపర్‌ హెర్క్యులస్‌ యుద్ధ విమానంలో దిగిన ప్రధాని మోదీ.. 342 కిలోమీటర్ల పొడవున నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వేను జాతికి అంకితంచేశారు.

ఇప్పుడు దేశంలో ఎక్కడ ఏ కొత్త జాతీయ రహదారి, ఎక్స్ ప్రెస్ వే నిర్మించినా యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేలా అత్యవసర ల్యాండింగ్‌ స్ట్రిప్‌లు ఏర్పాటుచేస్తోంది. ఇందులో భాగంగా తెరపైకి వచ్చినవే ఫైటర్ జెట్ ల్యాండింగ్ హైవేలు. పూర్వాంచల్‌ ఎక్స్‌ ప్రెస్‌ రహదారిపై సుల్తాన్‌పూర్‌ దగ్గర యుద్ధ విమానాలు దిగేందుకు వీలుగా దాదాపు మూడు కిలోమీటర్ల మేర ల్యాండింగ్‌ స్ట్రిప్‌ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో భారత వాయుసేన విమానాలు ఇక్కడే దిగేందుకు వీలుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైమానిక విన్యాసాలను ప్రధాని మోదీ తిలకించారు. ఈ విన్యాసాల్లో ఏఎన్‌-32 విమానం, ఫైటర్‌ జెట్‌లు సుఖోయ్‌-30 ఎంకేఐ, మిరాజ్‌-2000, రఫేల్‌ వంటి యుద్ధవిమానాలు పాల్గొని పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వేపై ల్యాండయ్యాయి. టేకాఫ్‌ తీసుకున్నాయి. ల్యాండ్‌ అయిన యుద్ధవిమానాల నుంచి దిగిన ఆర్మీ ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

342 కిలోమీటర్ల పొడవున నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ వే కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. లక్నో-సుల్తాన్ పూర్ హైవేపై ఉన్న చాంద్ సరాయ్ గ్రామం నుంచి ఇది ప్రారంభమవుతుంది. బారాబంకీ, అమేథీ, సుల్తాన్ పూర్, ఫైజాబాద్, అంబేద్కర్ నగర్, ఆజంఘర్, మౌ మీదుగా ప్రయాణిస్తూ ఘాజీపూర్ జిల్లాలోని హల్దారియా గ్రామం వద్ద ఇది పూర్తవుతుంది. జూలై 2018లో ప్రధాని శంఖుస్ధాపన చేసిన ఈ హైవే కేవలం మూడేళ్ల వ్యవధిలోనే శరవేగంగా రూపుదిద్దుకుంది. మొత్తం 22వేల 500 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఆరులైన్లతో నిర్మించి భవిష్యత్తులో ఎనిమిది లైన్లుగా కూడా వాడుకునే వీలుంది.

Tags

Read MoreRead Less
Next Story