అసలు ఆ టైమ్‌లో బయటకు ఎందుకు వెళ్లాలి..: అత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ మెంబర్ సంచలన వ్యాఖ్యలు

అసలు ఆ టైమ్‌లో బయటకు ఎందుకు వెళ్లాలి..: అత్యాచార ఘటనపై జాతీయ మహిళా కమిషన్ మెంబర్ సంచలన వ్యాఖ్యలు
తప్పంతా మహిళదే అని ఓ మహిళ అదీ జాతీయ మహిళా కమిషన్ హోదాలో ఉన్న మహిళ ఇలా మాట్లాడడం సరికాదని ఆగ్రహం

ఉత్తరప్రదేశ్‌ బదాయులో జరిగిన అత్యాచార ఘటనకు తప్పంతా బాధిత మహిళదే అని మాట్లాడుతున్నారు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి. అసలు ఆ టైమ్‌‌లో ఆమెబయటకు ఎందుకు రావాలి అని ప్రశ్నించి వివాదంలో చిక్కుకున్నారు. బాధిత మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన సభ్యురాలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం.. సాటి మహిళను కించపరచడమే అని మహిళా సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. అసలే అత్యాచారం చేసిన వాళ్లు దర్జాగా తిరిగే దేశం మనది.. ఒక్కడికైనా సకాలంలో సరైన శిక్షలు పడితే రెండో వాడు ఆ పని చేయడానికి జంకుతాడు.. కానీ అలాంటివి ఏవీ లేకపోగా తప్పంతా మహిళదే అని ఓ మహిళ అదీ జాతీయ మహిళా కమిషన్ హోదాలో ఉన్న మహిళ ఇలా మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రముఖి వ్యాఖ్యలపై స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ.. ఆమెను పిలిపించి మాట్లాడి తీవ్రంగా మందలించినట్లు తెలుస్తోంది. మహిళకు ఏ సమయంలోనైనా ఎక్కడికి వెళ్లాలన్నా పూర్తి స్వేచ్ఛతో పాటు హక్కు కూడా ఉందని అన్నారు.

బాధిత మహిళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన చంద్రముఖి.. సాయింత్రం బయటకు వెళ్లకపోయి ఉంటే బాగుండేది.. ఒకవేళ వెళ్లాల్సి వస్తే ఎవరినైనా తోడు తీసుకుని వెళితే బాగుండేదని.. అలా చేసి ఉంటే ఆమెపై అత్యాచారం జరిగి ఉండేది కాదని.. క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేదని అన్నారు.

కాగా, ఇదివరకు కూడా ఇలాంటి కొన్ని సందర్భాల్లో అత్యున్నత స్థానంలో ఉన్న మహిళలు ఇలానే వ్యాఖ్యానించారు. దేశ రాజధాని నిర్భయ ఉదంతాన్నే తీసుకుంటే.. అప్పుడు కూడా బాధిత మహిళ రేపిస్టులను అన్నయ్యా అని బతిమాలుకుంటే ఆమెను వదిలేసేవారు కదా అని వ్యాఖ్యానించడం విశేషం. సినిమాల్లో స్కిప్ట్ రాసుకుని డైలాగులు చెప్పినట్లుగా అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో తనని తాను కాపాడుకునేందుకు ఆ విధంగా మాట్లాడమని చెప్పడం వాళ్ల ఉద్దేశం కాబోలు. అంతేకాని రేపిస్టుది ఎంత మాత్రం తప్పు లేదు అని వాళ్ల అంతరంగ భావన. వాళ్లు అలా చెలరేగి పోవడం వారి నైజం.. వారి నుంచి మహిళలే దూరంగా పారిపోవాలనేది అత్యున్నత హోదాలో ఉన్న మహిళల అంతరంగ అభిప్రాయం.

ఉత్తరప్రదేశ్‌లో 50 ఏళ్ల అంగన్‌వాడీ కార్యకర్త సాయింత్రం సమయంలో దేవాలయానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ ఉన్న గుడిలోని పూజారితో పాటు, మరో అయిదుగురు కామాంధులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె పక్కటెముకలు విరిచారు.. రెండు కాళ్లు విరగ్గొట్టారు. అత్యంత హేయంగా ఆమె ప్రైవేట్ పార్ట్స్‌ని ఛిద్రం చేశారు. ఊపిరితిత్తుల్లో ఇనుప ఊచలతో దారుణంగా గాయపరిచిన ఘటన మరో నిర్భయను తలపించింది. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన దుర్మార్గులు.. ఆలయ పూజారి సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ఈ క్రమంలో బాధిత మహిళ ఇంటికి వచ్చి పరామర్శించిన అనంతరం చంద్రముఖి ఈ వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది. ఇటువంటి వారు జాతీయ మహిళా సభ్యురాలిగా ఉండడం ఆ పదవికే సిగ్గు చేటని ఆమెను వెంటనే తొలగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.



Tags

Read MoreRead Less
Next Story