రైతుల ఆదాయాన్ని పెంచాలన్న ఉద్దేశంతోనే కొత్త చట్టాలు : మోదీ

రైతుల ఆదాయాన్ని పెంచాలన్న ఉద్దేశంతోనే కొత్త చట్టాలు : మోదీ

వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మధ్య ఉన్న అడ్డుగోడలు.. నూతన సాగు చట్టాలతో తొలగిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కొత్త చట్టాలతో రైతులు కొత్త అవకాశాలు, మార్కెట్లు, ప్రత్నామ్నాయాలను అందిపుచ్చుకోనున్నారని చెప్పారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులతో రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఓవైపు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ఆందోళన 17వ రోజూ కొనసాగుతోంది. కేంద్రం దిగిరాకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ తరుణంలో మోదీ తాజా వ్యాఖ్యలకు ప్రధాన్యం ఏర్పడింది.

కొత్త చట్టాల్లో పేర్కొన్నట్లుగా రైతులు తమ పంట ఉత్పత్తుల్ని వారి ఇష్టం మేరకు మార్కెట్లలో లేదా బయట.. ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. త్వరలో శీతల గిడ్డంగులను ఆధునికీకరించనున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు మరింత పెరుగుతాయని చెప్పారు. రైతుల ఆదాయాన్ని పెంచి.. వారి జీవితాల్ని మరింత సుభిక్షంగా మార్చాలన్న ఉద్దేశంతోనే కొత్త చట్టాల్ని తీసుకొచ్చామని తెలిపారు. రైతుల ప్రయోజనాల్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ పునరుద్ఘాటించారు. ఫిక్కీ 93వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. కరోనా ఉత్పాతం తర్వాత ఆర్థికవ్యవస్థ ఊహించదాని కంటే వేగంగా పుంజుకుంటోందని చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రికార్డుస్థాయిలో పెరిగాయని చెప్పారు.


Tags

Read MoreRead Less
Next Story