భారత్‌లో మరింత ఎక్కువవుతోన్న కరోనా వైరస్‌ ఉధృతి

భారత్‌లో మరింత ఎక్కువవుతోన్న కరోనా వైరస్‌ ఉధృతి

దేశంలో కరోనా వైరస్‌ ఉధృతి మరింత ఎక్కువవుతోంది. భారత్‌లో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 43 లక్షల 70 వేలు దాటింది. మంగళవారం ఒక్క రోజే.. 89 వేల 706 పాజిటివ్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయి. వీరిలో 8 లక్షల 97 వేల 394 యాక్టివ్ కేసులు ఉండగా.. 33 లక్షల 98 వేల 844 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. గత 24 గంటల్లో 11 వందల 15 మంది వైరస్‌తో చనిపోయారు. దేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 73 వేల 890కి చేరింది.

కేసుల పరంగా మొదటిస్థానంలో ఉన్న మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజులో 20 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 43 వేలు దాటింది. వీరిలో దాదాపు రెండున్నర లక్షల యాక్టివ్ కేసులు ఉండగా... 6 లక్షల 72 వేల మంది డిశ్చార్జ్‌ అయ్యారు. మంగళవారం ఒక్కరోజులో 380 మంది చనిపోగా... మొత్తం మరణాలు 27 వేలు దాటాయి. రెండోస్థానంలో ఉన్న ఏపీలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా మరో 10 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 5 లక్షల 17 వేలు దాటింది. 96 వేల యాక్టివ్ కేసులు ఉండగా... 4 లక్షల 15 వేల మంది రికవర్ అయ్యారు. 4 వేల 560 మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో మరో 5 వేల 6 వందల కొత్త కేసులు వెలుగుచూశాయి. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 74 వేలు దాటింది. వారిలో 50 వేల యాక్టివ్‌ కేసులుండగా 4 లక్షల 16 వేల మంది డిశ్చార్జ్ అయ్యారు. తమిళనాడులో వైరస్‌ వల్ల 8 వేల 17 మంది ప్రాణాలు కోల్పోయారు.

దేశవ్యాప్తంగా కొవిడ్ మరణాలు రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే వారిలో దాదాపు 70 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలున్నవారేనని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 77 శాతం ఉండగా.. మరణాల రేటు 1.7 శాతంగా ఉంది. అటు కరోనా పరీక్షలను కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెంచుతోంది. నిన్న ఒక్క రోజులో 11 లక్షల 54 వేల టెస్టులు నిర్వహించినట్టు ICMR తెలిపింది. టెస్టులు పెరుగుతుండటంతో.. పాజిటివ్‌ కేసులు కూడా ఎక్కువగా వస్తున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. నిన్నటి వరకు దేశంలో 5 కోట్ల 18 లక్షల మందికి పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story