దేశంలో కరోనా కలకలం.. ఆదివారం నుంచి సామాజిక కార్యక్రమాలు నిషేధం!

దేశంలో కరోనా కలకలం.. ఆదివారం నుంచి సామాజిక కార్యక్రమాలు నిషేధం!
కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న 11 జిల్లాల్లో సామాజిక కార్యక్రమాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు సీఎం వెల్లడించారు.

దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుండడంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా లేఖ రాశారు. కరోనా వ్యాప్తిపై నిఘా, నియంత్రణ, జాగ్రత్తల కోసం జారీ చేసిన మార్గదర్శకాలను మార్చి 31 వరకు పొడిగించినట్టు తెలిపారు. కరోనా నియంత్రణ కోసం ప్రజలంతా మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం, చేతుల్ని శుభ్రపరుచుకొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలను రాష్ట్రాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. కరోనా కేసులు ఐదు నెలలుగా క్షీణించినట్టు కనబడినా కొన్ని వారాలుగా మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘనలు తమ దృష్టికి వచ్చినట్టు అజయ్ భల్లా లేఖలో ప్రస్తావించారు. రాబోయే పండుగలను దృష్టిలో పెట్టుకొని కొవిడ్‌ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని సూచించారు. కరోనా నివారణ చర్యలు, మార్గదర్శకాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్రాలకు సూచించారు.

కరోనా వైరస్‌ మహారాష్ట్రను వణికిస్తోంది. మళ్లీ అక్కడ 25వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24గంటల్లో 25 వేల 681 కొత్త కేసులు, 70 మరణాలు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, ముంబయి మహా నగరంపైనా కరోనా పంజా విసిరింది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో అక్కడ 3062 కేసులు నమోదయ్యాయి. కొత్తగా మరో 10మంది మృతిచెందారు. నాగ్‌పూర్‌లో తాజాగా నమోదైన కేసులు కలవరపరుస్తున్నాయి. 3, 235 కొత్త కేసులు, 35 మరణాలు వెలుగుచూశాయి.

ముంబయిలోని మురికవాడ ధారావిలో 30 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఆరు నెలల తరవాత ఈ స్థాయిలో కొత్త కేసులు బయటపడ్డాయి. ఇరుకు ప్రదేశాలు, సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడే ధారావిలో మహమ్మారి విజృంభణ గురించి స్థానిక యంత్రాంగంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆసియాలోనే అతిపెద్ద మురికి వాడ అయిన ధారావిలో ఇప్పటివరకు 4 వేల 328 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం అక్కడ 140 క్రియాశీల కేసులున్నాయి.

కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తి‌ కట్టడికి చర్యలు చేపట్టింది. ఈ ఆదివారం మూడు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించాలని సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నిర్ణయించారు. రాష్ట్రంలోని పలు నగరాల్లో పెద్ద సంఖ్యలో కేసులు వెలుగుచూస్తుండటంతో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలోని ఇండోర్‌, భోపాల్‌, జబల్‌పూర్‌ నగరాల్లో ఒక్కరోజు లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయించారు. అలాగే, ఈ నెల 31 వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను మూసివేయనున్నారు. మధ్యప్రదేశ్‌లో గడిచిన 24గంటల్లో 1140 కేసులు, ఏడు మరణాలు నమోదయ్యాయి.

కరోనా వ్యాప్తి కట్టడికి ఇప్పటికే రాష్ట్రంలోని పలుచోట్ల ఆంక్షలు అమలు చేస్తున్న పంజాబ్ ప్రభుత్వం.. వాటిని మరింత కఠినతరం చేయాలని నిర్ణయించింది. మార్చి 31 వరకు విద్యా సంస్థలన్నీ మూసివేయనున్నట్టు ప్రకటించింది. అలాగే, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌పైనా పరిమితులు విధించారు. సినిమా థియేటర్లు 50శాతం సామర్థ్యంతో నడిచేందుకు అవకాశం కల్పించారు. ప్రజలంతా రెండు వారాల పాటు సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సీఎం విజ్ఞప్తి చేశారు. కుటుంబ సభ్యులు, బంధువులతో పరిమిత సంఖ్యలో తమ ఇళ్లలోనే కార్యక్రమాలు జాగ్రత్తగా నిర్వహించుకోవాలని కోరారు. కరోనా వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న 11 జిల్లాల్లో మాత్రం ఆదివారం నుంచి సామాజిక కార్యక్రమాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు సీఎం వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story