దేశంలో వెలుగులోకి కరోనా కొత్త రకం వేరియంట్‌లు

దేశంలో వెలుగులోకి కరోనా కొత్త రకం వేరియంట్‌లు
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 771 రకాల కరోనా కొత్త వేరియంట్లను వైద్య నిపుణులు గుర్తించారు.

అసలే కరోనా కేసుల పెరుగుదలతో బెంబేలెత్తుతున్న తరుణంలో.. దేశంలో వైరస్ కొత్త రకం వేరియంట్ లు వెలుగులోకి వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 771 రకాల కరోనా కొత్త వేరియంట్లను వైద్య నిపుణులు గుర్తించారు. బ్రిటన్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాల్లో వెలుగుచూసిన వైరస్‌లు.. దేశంలోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వ్యాపిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. అయితే దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదలకు ఈ కొత్త వేరియంట్లే కారణమనేందుకు ఆధారాలు లభించలేదని పేర్కొంది. వీటి జన్యుక్రమం, ఉత్పరివర్తనాలు, వ్యాప్తిపై ఇండియన్‌ సార్స్‌-కొవ్‌-2 కన్సార్షియం ఆన్‌ జీనోమిక్స్‌- ఇన్సాకాగ్‌ అధ్యయనం సాగిస్తున్నట్లు తెలిపింది.

మొత్తం 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 10,787 నమూనాలను సేకరించిన శాస్త్రవేత్తలు 771 కేసుల్లో వైరస్‌ మార్పులు వైవిధ్యంగా ఉన్నట్టు తేల్చారు. ఈ కరోనా రకాల్లోని 736 కేసుల్లో బ్రిటన్‌ రకం వైరస్‌, 34 కేసుల్లో దక్షిణాఫ్రికా రకం, ఇంకో కేసులో బ్రెజిల్‌ రకం వైరస్‌ కారణమని నిర్ధారణ అయింది. వాటికి ఆదనంగా డబుల్ మ్యుటెంట్ కరోనా ఉన్నట్లు గుర్తించారు. దేశంలోని సుమారు 70 జిల్లాలకు కరోనా కొత్త రకాలు విస్తరించాయని ఆరోగ్యశాఖ పేర్కొంది.

గత డిసెంబరుతో పోల్చితే E484Q, L452R ఉత్పరివర్తనాల వేగం పెరిగింది. ఇలాంటి మ్యుటెంట‌్ లు రోగనిరోధక వ్యవస్థకు చిక్కకుండా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయని అంచనా వేసింది. కేరళలోని 14 జిల్లాల నుంచి సేకరించిన 2వేల32 నమూనాలను పరిశీలించగా 123 శాంపిళ్లలో N440K రకం వైరస్‌ కనిపించింది. రోగనిరోధక వ్యవస్థ నుంచి కూడా తప్పించుకోవడం దీని ప్రత్యేకత. ఇంతకుముందు ఏపీ నుంచి సేకరించిన నమూనాల్లో 33శాతం, తెలంగాణ నుంచి సేకరించిన వాటిల్లో సుమారు 50శాతం ఈ రకం వైరసే కనిపించింది. బ్రిటన్‌, డెన్మార్క్‌, సింగపూర్‌, జపాన్‌, ఆస్ట్రేలియాల్లో ఈ వేరియంట్ మూలాలున్నట్లు గుర్తించారు.

కరోనా వేరియంట్‌, స్ట్రెయిన్‌ వేరువేరుగా ఉంటాయి. ఒక వైరస్ లో మ్యూటేషన్ లు జరిగినా.. దాని ప్రాథమిక ప్రవర్తనలో మార్పు రాకపోతే కొత్త వేరియంట్‌ గానూ.. మ్యూటేషన్ల వల్ల ఆ వైరస్‌ ప్రవర్తనే పూర్తిగా మారిపోతే కొత్త స్ట్రెయిన్‌గా పరిగణిస్తారు.



Tags

Read MoreRead Less
Next Story