Omicron variant : భారత్‌లో పంజా విసురుతున్న ఒమిక్రాన్..!

Omicron variant :  భారత్‌లో పంజా విసురుతున్న ఒమిక్రాన్..!
Omicron : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో పంజా విసురుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తూ పలు రాష్ట్రాల్లో వైరస్ కోరలు చాస్తోంది.

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో పంజా విసురుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తూ పలు రాష్ట్రాల్లో వైరస్ కోరలు చాస్తోంది. ఇప్పటికే దేశంలో 111కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. డెల్టా రకం కన్నా వేగంగా ఈ కొత్త వేరియంట్ వైరస్ వ్యాప్తి చెందుతోంది. శుక్రవారం ఒక్కరోజే కర్నాటకలో 5, తెలంగాణలో 4 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తంగా అత్యధికంగా మహారాష్ట్రలో 40, ఢిల్లీలో 22, రాజస్తాన్‌లో 17, తెలంగాణలో 8, కర్నాటకలో 7, కేరళలో 5, గుజరాత్‌లో 5, ఏపీ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఒక్కొక్క ఒమిక్రాన్ కేసు వెలుగుచూసింది.

ముంబైలో ఇప్పటివరకు 15 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. అయితే మూడో డోసు తీసుకున్న వ్యక్తికి కూడా ఒమిక్రాన్ సోకడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. అమెరికా నుంచి ముంబై వచ్చిన వ్యక్తికి ఎయిర్‌పోర్టులో టెస్టులు నిర్వహించగా పాజిటీవ్ అని నిర్ధారణ అయింది. దీంతో శాంపిల్స్ కోసం అతడిని జీనోమ్ టెస్టింగ్‌కు పంపారు ముంబై మున్సిపల్ అధికారులు. భారత్‌లో క్రమంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంపై కేంద్రం రాష్ట్రాలను మరింత అప్రమత్తం చేసింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపిన కేంద్రం.. అమెరికాలోని పరిస్థితులను దేశంలోకి తీసుకురావొద్దని హెచ్చరించింది. యూకే, ఫ్రాన్స్ దేశాల్లో ఒమిక్రాన్, కరోనా విజృంభణ స్థాయిని వివరించిన కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ చీఫ్‌ వీకే పాల్.. భారత్‌లో అలాంటి పరిస్థితులు ఏర్పడితే రోజుకు లక్షలాది కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఒమిక్రాన్‌ వ్యాప్తి దృష్ట్యా ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలని కేంద్రం సూచించింది. వ్యాక్సిన్లు వేయించుకోవడం, మాస్క్‌ ధరించడం, శానిటైజర్లు వాడకంతో పాటు జనం రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని తెలిపింది. అలాగే నూతన సంవత్సర వేడుకలను కొద్దిమందితోనే జరుపుకొనేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. గత 20 రోజులుగా మన దేశంలో రోజుకు 10వేలు కన్నా తక్కువ కొవిడ్‌ కేసులే వస్తున్నప్పటికీ.. దేశంలో కొత్త వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టంచేసింది.

Tags

Read MoreRead Less
Next Story