రెండు రోజులు కీలకమైన బిల్లు.. డుమ్మా కొట్టొద్దు.. ఎంపీలకు బీజేపీ విప్ జారీ

రెండు రోజులు కీలకమైన బిల్లు.. డుమ్మా కొట్టొద్దు.. ఎంపీలకు బీజేపీ విప్ జారీ
Parliament: పార్లమెంట్ సమావేశాలకు తప్పక హాజరుకావాలంటూ రాజ్యసభ ఎంపీలను ఆదేశించింది బీజేపీ. ఎంపీలకు నిన్ననే మూడు లైన్ల విప్‌ను జారీ చేసింది.

ఇవాళ, రేపు జరిగే పార్లమెంట్ సమావేశాలకు తప్పక హాజరుకావాలంటూ రాజ్యసభ ఎంపీలను ఆదేశించింది బీజేపీ. ఎంపీలకు నిన్ననే మూడు లైన్ల విప్‌ను జారీ చేసింది. ఇవాళ్టి పార్లమెంట్ సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 13వ తేదీతో పార్లమెంట్ సెషన్స్ ముగుస్తుండడంతో.. మోదీ సర్కారు బిల్లుల్ని ఆమోదింపజేసుకునే పనిలో పడింది. ఈ మూడు రోజుల్లో ముఖ్యమైన బిల్లులను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదించేందుకు కేంద్రం సిద్ధమైంది. దీంతో పార్లమెంట్‌లో ఇవాళ, రేపు కీలక పరిణామాలు జరగనున్నాయి.

ఇవాళ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉందని, ఈ భేటీకి బీజేపీ ఎంపీలందరూ హాజరు కావాల్సిందిగా పార్టీ నుంచి సమాచారం వెళ్లింది. గతవారం కూడా బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సభలో విపక్షాలు అనుసరిస్తోన్న వైఖరిని ప్రజల్లో ఎండగట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

జూలై 19న ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి. పెగాసస్‌ స్పైవేర్‌ అంశం, సాగు చట్టాలపై చర్చకు పట్టుబట్టాయి. దీంతో ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా పార్లమెంట్‌ సజావుగా జరగలేదు. మరోవైపు విపక్షాల గందరగోళం మధ్యనే.. ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి ఆమోదించింది. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటోంది బీజేపీ.

Tags

Read MoreRead Less
Next Story