ఇవాళ్టి నుంచి మూడో దశ వ్యాక్సినేషన్‌..!

ఇవాళ్టి నుంచి మూడో దశ వ్యాక్సినేషన్‌..!
ఇవాళ్టి నుంచి మూడో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయనున్నారు. అయితే, పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఇవాళ్టి నుంచి మూడో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారికి టీకాలు వేయనున్నారు. అయితే, పలు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కేంద్రం నుంచి వ్యాక్సిన్‌ డోసులు రాకపోవడంతో టీకాలు వేయలేమని బహిరంగంగానే చెబుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. తెలంగాణలో ఇవాళ, రేపు వ్యాక్సిన్లు వేయబోరని స్పష్టం చేసింది ఆరోగ్య శాఖ. అసలు 45 ఏళ్లు పైబడిన వారికే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్లు వేయలేకపోయామన్న రాష్ట్రాలు.. 18 ఏళ్లు నిండిన వారికి టీకాలు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తున్నాయి. కొవిన్‌ యాప్‌లో 18 నుంచి 45 ఏళ్లలోపు వారిలో ఇప్పటిదాకా 2 కోట్ల 45 లక్షల మంది నమోదు చేసుకున్నారు. కాని, అన్ని రాష్ట్రాల్లో కలిపి కేవలం కోటిన్నర డోసులు మాత్రమే నిల్వలున్నట్టు తెలుస్తోంది.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కూడా 18 నుంచి 45 ఏళ్ల వాళ్లు వ్యాక్సినేషన్ సెంటర్లకు రావొద్దని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీకి వ్యాక్సిన్‌ డోసులు రాలేదని, మరో రెండు మూడు రోజుల్లో 3 లక్షల డోసులు వస్తాయని, అప్పుడే డ్రైవ్‌ మొదలు పెడతామని కేజ్రీవాల్ తెలిపారు. ఏపీలోనూ డోసుల కొరత కారణంగా ఇవాళ కార్యక్రమం ప్రారంభం కావడం లేదు. డోసుల కొరత కారణంగా ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సి ఉన్న మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు కొన్ని రాష్ట్రాలు దూరంగా ఉన్నాయి.

వ్యాక్సిన్‌ డోసుల పంపిణీలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని మహారాష్ట్ర ప్రభుత్వం సైతం విమర్శించింది. కొత్త వ్యాక్సిన్‌ డోసులు రాష్ట్రానికి రానందున మూడో దశ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందని కర్నాటక ప్రభుత్వం ప్రకటించింది. సీరం సంస్థకు కోటి డోసులు కావాలని ఆర్డర్‌ చేశామని, అవి ఇవాళ్టికి రాష్ట్రానికి చేరుకునే అవకాశం లేనందున వ్యాక్సినేషన్‌ ప్రారంభించలేమని కర్నాటక ప్రభుత్వం తెలిపింది. డోసులు లేకపోవడంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మొదలు పెట్టలేమని జమ్మూ కశ్మీర్‌లో అధికార యంత్రాంగం సైతం చేతులెత్తేసింది.

భారత్‌ ఎదుర్కొంటున్న వ్యాక్సిన్ కొరతను తీర్చడానికి రష్యా ముందుకొచ్చింది. వచ్చే నెల నాటికి 50 లక్షల స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి రానున్నాయని రష్యాలో భారత రాయబారి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story