Narendra Modi : ఇవాల్టి నుంచి మూడ్రోజుల పాటు మోదీ యూరప్‌ పర్యటన

Narendra Modi :  ఇవాల్టి నుంచి మూడ్రోజుల పాటు మోదీ యూరప్‌  పర్యటన
Narendra Modi : ప్రధాని మోదీ.... ఇవాల్టి నుంచి మూడ్రోజుల పాటు యూరప్‌లో పర్యటించనున్నారు. జర్మనీ, డెన్మార్క్‌, పారిస్‌లో పర్యటిస్తారు.

Narendra Modi : ప్రధాని మోదీ.... ఇవాల్టి నుంచి మూడ్రోజుల పాటు యూరప్‌లో పర్యటించనున్నారు. జర్మనీ, డెన్మార్క్‌, పారిస్‌లో పర్యటిస్తారు. ముందుగా జర్మనీకి, అక్కడి నుంచి డెన్మార్క్‌కు వెళ్లనున్నారు. తిరుగు ప్రయాణంలో ఈ నెల 4న పారిస్‌ చేరుకుంటారు. ఈ మూడు దేశాల్లో 65 గంటల పాటు గడపనున్నారు. ఈ టూర్‌లో 7 దేశాలకు చెందిన 8 మంది ప్రపంచ నేతలు, 50 మంది అంతర్జాతీయ పారిశ్రాకవేత్తలతో సమావేశమవుతారు. మొత్తంగా 25 సమావేశాల్లో పాల్గొంటారు. పలువురు ప్రపంచ నేతలతో భేటీలో ద్వైపాక్షిక, బహుపాక్షిక అంశాలపై కీలక చర్చలు జరపనున్నారు. ప్రవాస భారతీయులతో సమావేశమై మాట్లాడనున్నారు.

యూరోపు దేశాలు అనేక సవాళ్లతో సతమతమవుతున్న సమయంలో యూరప్‌ పర్యటనకు వెళ్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. శాంతి, సౌభాగ్యాల కోసం భారత్‌ అన్వేషిస్తోందని, యూరోపియన్ భాగస్వాములు చాలా ముఖ్యమైన సహచరులన్నారు. యూరోప్ దేశాలతో సహకార స్ఫూర్తిని బలోపేతం చేసుకోవడానికి డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటిస్తున్నట్లు తెలిపారు.

ముందుగా బెర్లిన్‌లో జర్మన్ ఛాన్స్‌లర్‌తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జర్మనీలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోనే ఈ ఐజీసీ జరుగుతుండటం పట్ల మోదీ హర్షంప్రకటించారు. మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రాధాన్యాలను గుర్తించేందుకు ఇది దోహదపడుతుందన్నారు. మంగళవారం డెన్మార్క్‌లో కోపెన్‌హాగన్‌లో మోదీ పర్యటిస్తారు. ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఐస్‌లాండ్ ప్రధాని కట్రిన్ జాకబ్స్‌డొట్టిర్, నార్వే పీఎం జోనాస్ గహ్ర్ స్టోర్, స్వీడన్ పీఎం మగ్ధలీనా ఆండర్సన్, ఫిన్లాండ్ ప్రధాని సన్న మారిన్‌లతో కూడా చర్చలు జరుపుతారు. డెన్మార్క్‌లోని భారత సంతతి ప్రజలను కూడా కలుస్తారు.

ఈ నెల 4న స్వదేశానికి తిరిగి వచ్చే ముందు ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు మోదీ. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయేల్ మేక్రన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఫ్రాన్స్‌లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో మేక్రన్ విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన పది రోజుల్లోనే తాను ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత మైత్రి బలపడటానికి తన పర్యటన దోహదపడుతుందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story