కరోనాతో ఆటలా.. విందులూ వినోదాలా: పెళ్లి వారికి పోలీసుల పనిష్మెంట్

కరోనాతో ఆటలా.. విందులూ వినోదాలా: పెళ్లి వారికి పోలీసుల పనిష్మెంట్
కరోనాతో దేశం అల్లకల్లోలం అయిపోతుంటే అవేవీ పట్టనట్టు వివాహ వేడుకలు, పుట్టినరోజు పండుగలు చేసుకుంటున్నారు.

సామాజిక దూరాన్ని పాటించండి లేకపోతే చచ్చిపోతారు అంటే అసలు వినట్లేదు. కరోనాతో దేశం అల్లకల్లోలం అయిపోతుంటే అవేవీ పట్టనట్టు వివాహ వేడుకలు, పుట్టినరోజు పండుగలు చేసుకుంటున్నారు.

తాజాగా ఓ వేడుకలో ఉన్న అతిధులను చూసి పోలీసులకు చిర్రెత్తుకొచ్చింది. వీళ్లకి గట్టి పనిష్మెంట్ ఇస్తే తప్ప బుద్ది రాదనుకున్నారు. వారి చేత కప్పగంతులు వేయించారు.

మధ్య ప్రదేశ్ భింద్ జిల్లాలో జరిగే వివాహ వేడుకకు అతిథులు హాజరయ్యారు. లాక్డౌన్ నియమాలను పాటిస్తున్నారా లేదా అని తనిఖీ చేయడానికి గస్తీ తిరుగుతున్న పోలీసులకు ఓ చోటు వివాహ కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసింది.

అంతే అక్కడికి హుటా హుటిన బయలు దేరారు. వచ్చిన అతిధులపై లాఠీ ఛార్జ్ తో పాటు కప్పగంతులు వేయించారు.

కోవిడ్ లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఉమారి గ్రామంలో జరిగిన వివాహానికి దాదాపు 300 మంది హాజరయ్యారు. పోలీసులు వేదికపైకి వెళ్లినప్పుడు, అతిధుల్లో చాలామంది పోలీసులకు దొరకకుండా తప్పించుకోగలిగారు.

పోలీసులు తమ చేతికి చిక్కిన వారిని పొలానికి సమీపంలో ఉన్న ఒక వీధిలో కప్ప గంతులు వేయించారు. పోలీసులు నిలబడి చూస్తుండగా 17 మంది పురుషులు ఈ శిక్షను అమలు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ వ్యక్తి సరిగా చేయట్లేదని అతడి వీపుపై పోలీసులు నాలుగు వాయించారు.

శిక్ష తరువాత, లాక్డౌన్ అమలులో ఉన్నంతవరకు ఇలాంటి సమావేశాలకు హాజరుకావద్దని వారిని హెచ్చరించి విడుదల చేశారు.

లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గత వారం బీహార్‌లోని కిషన్‌గంజ్‌లో అక్కడి ప్రజలకు ఇలాంటి శిక్షలే విధించారు.

మధ్యప్రదేశ్ లో గత 24 గంటల్లో 5,065 కరోనా వైరస్ కేసులు వెలుగు చూశాయి. వైరస్ సంక్రమణ రాష్ట్రంలో 7.47 లక్షలకు పైగా ఉంది. వైరస్ కారణంగా రాష్ట్రంలో 7,227 మంది మరణించారు.

Tags

Read MoreRead Less
Next Story