కన్నడ రాజకీయాల్లో మరో మలుపు

కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి తొలగకపోయినా.. క్షణ క్షణానికి మారుతున్న పరిణామాలు ఉత్కంఠ పెంచుతున్నాయి. సీఎం కుమార స్వామి మాత్రం రాజీనామాకు ససేమిరా అంటున్నారు.. తాను బలపరీక్షకు సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. సమయం ఖరారు చేయాలని స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ను సీఎం కుమారస్వామి కోరారు.

ప్రస్తుతం ఎమ్మెల్యేల రాజీనామాలతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అన్నారు కుమార స్వామి. ఇలాంటి సమయంలో తాను అధికారంలో ఉండలేను అన్నారు. అయితే తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందని, దాన్ని రుజువు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. తాజా పరిణామాల నేపథ్యంలో బలపరీక్షకు అనుమతి ఇవ్వాలని ఆయన స్పీకర్‌ను కోరారు. కుమార స్వామి బలనిరూపణకు సిద్ధమనడంతో బీజేపీ కూడా సై అంటోంది. ఈ నెల 17వ తేదీన బల పరీక్ష ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే రెబల్‌ ఎమ్మెల్యేలు రాజీనామా ఉపసంహరణకు ససేమిరా అంటున్నారు.. మరోవైపు బీజేపీ బలం 107కు పెరిగింది. ఈ సమయంలో కుమార స్వామి బల నిరూపణకు సై అనడంతో బీజేపీ గందరగోళానికి గురవుతోంది. తమ ఎమ్మెల్యేలు ఎవరైనా హ్యాండిస్తారే అని లెక్కలు వేసుకుంటోంది.

మరోవైపు కర్ణాటక రెబల్‌ ఎమ్మెల్యేలు, స్పీకర్‌ రమేశ్‌ కుమార్‌ పిటిషన్లపై సుప్రీం కోర్టు రెండో రోజూ సుదీర్ఘంగా విచారించింది. స్పీకర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం.. ప్రస్తుతం ఎమ్మెల్యేల రాజీనామా, అనర్హత వేటుపై స్పీకర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించింది.. దీనిపై తుది తీర్పును మంగళవారం ప్రకటిస్తామని సుప్రీకోర్టు స్పష్టం చేసింది. కోర్టు సూచనలతో మంగళవారం వరకు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపించడం లేదు. సీఎం కుమార స్వామి కూడా బలనిరూపణకు సై అంటున్నారు. దీంతో మళ్లీ కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యేలంతా తమ శిబిరాలకు వెళ్లారు. బీజేపీ సైతం తమ ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ రెబల్‌ క్యాంపులో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం స్పీకర్‌ను కలిసి తమ నిర్ణయాన్ని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు సైతం తమ ఎమ్మెల్యేల తీరుపై మండిపడుతున్నారు. వారంతా తమ పదవికి రాజీనామా చేయడమంటే పార్టీ ఫిరాయించినట్లేనని, దీనిపై కోర్టు జోక్యం చేసుకోవాలని 400 మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పటిషన్‌ను సుప్రీం కోర్టు స్వీకరించింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని గందరగోళం ఏర్పడింది.

Recommended For You

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *