కేరళలో వేడెక్కిన రాజకీయాలు

కేరళలో వేడెక్కిన రాజకీయాలు
అమిత్‌షా ర్యాలీ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు బీజేపీలో చేరారు.

డాలర్, గోల్డ్ స్మగ్లింగ్ కేసులతో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా విమర్శించారు. బీజేపీ నిర్వహించిన కేరళ విజయ యాత్ర ముగింపు సందర్భంగా తిరువనంతపురంలో ఆదివారం ఏర్పాటుచేసిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. కేరళలో మార్పు తీసుకు వచ్చేందుకు 1,940 కిలోమీటర్ల మేరకు యాత్ర నిర్వహించమని తెలిపారు. నేటి నుంచి ఆత్మనిర్భర్ కేరళ మిషన్ వైపు తామంతా పని చేస్తామని చెప్పారు.

సంపూర్ణ అక్షరాస్యత సాధించి, పర్యాటకరంగాన్ని ఒక పరిశ్రమగా మార్చిన ఘనత కేరళకే చెందుతుందన్నారు. అయితే ఇప్పుడు రాష్ట్రాన్ని రాజకీయ హింస, అవినీతికి ఆలవాలంగా యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్ మార్చాయని తప్పుపట్టారు. యూడీఎఫ్ వచ్చినప్పుడు సోలార్ కుంభకోణం, ఎల్‌డీఎఫ్ అధికారంలోకి వచ్చినప్పుడు డాలర్ స్కామ్‌కు పాల్పడ్డాయని.. అవినీతి విషయంలో రెండూ పోటాపోటీ పడుతున్నాయన్నారు.

ఇక ఇటీవలే బీజేపీలో చేరిన మెట్రోమ్యాన్ శ్రీధరన్‌పై అమిత్‌షా ప్రశంసలు కురిపించారు. కొంకన్ రైల్వే అభివృద్ధి ద్వారా దక్షిణ భారతావనితో ఇతర ప్రాంతాలకు అనుసంధానం జరిగి అభివృద్ధి అనేది కేరళ వరకూ చేరందని అన్నారు. ఈ ప్రయాణంలో శ్రీధరన్ కీలక భూమిక పోషించారని కొనియాడారు.

బీజేపీ మాత్రమే కేరళను రక్షించగలదని శ్రీధరన్ తెలిపారు. కేరళను రక్షించ గలిగే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు. దేశంలోని చాలా ప్రాజెక్టులకు తాను పనిచేశానని.. ఈ వయస్సులో కూడా పని చేసేందుకు తగినంత శక్తి తనకు ఉందన్నారు. ఈ శక్తిని కేరళ అభివృద్ధి కోసం వెచ్చించడం కోసమే బీజేపీలో చేరానని తెలిపారు.

ఇక అమిత్‌షా ర్యాలీ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు బీజేపీలో చేరారు. నటుడు దేవన్, రాధ, మాజీ బ్యూరోక్రాట్ కెవీ బాలకృష్ణన్ కాషాయ కండువా కప్పుకున్నారు.


Tags

Read MoreRead Less
Next Story