తమిళనాడులో పెరిగిన రాజకీయ వేడి.. కొత్త పొత్తులు, ఎత్తులు.. !

తమిళనాడులో పెరిగిన రాజకీయ వేడి.. కొత్త పొత్తులు, ఎత్తులు.. !
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన మరుసటి రోజు నుంచే రాజకీయం ఊపందుకుంది.

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన మరుసటి రోజు నుంచే రాజకీయం ఊపందుకుంది. ఎవరి వ్యూహాల్లో వారు తలమునకలైపోయారు. BJP, అన్నాడీఎంకే నేతలు సీట్ల సర్దుబాటు ప్రక్రియను ముమ్మరం చేశారు. శనివారం ఇరు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు అంశంపై చర్చలు మొదలయ్యాయి. కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, వీకే సింగ్‌తో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌... అన్నాడీఎంకే ముఖ్యనేతలైన సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం, పన్నీర్‌ సెల్వంతో చర్చలు జరిపారు.

సీట్ల సర్దుబాటుపై జరిగిన ఈ చర్చలు త్వరలోనే కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది. తమ పార్టీకి గెలిచే అవకాశం ఉందని భావిస్తున్న 60 స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే అన్నాడీఎంకే ప్రణాళిక ఆ పార్టీకి ఉంటుందని, ఇరు పార్టీలకు అంగీకారం కుదిరిన తర్వాత అధికారికంగా వెల్లడిస్తామని కమలం నేతలు చెబుతున్నారు. అయితే మిత్రపక్షాలతో చర్చించిన తర్వాత...బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి.. మిత్రపక్షాలకు ఎన్ని కేటాయించాలనేది నిర్ణయించనుంది అన్నాడీఎంకే హైకమాండ్.

దశాబ్ద కాలంగా అన్నాడీఎంకేతో కలిసి నడిచిన సినీనటుడు, ఏఐఎస్‌ఎంకే అధినేత ఆర్‌.శరత్‌ కుమార్‌ ఎంఎన్‌ఎం అధినేత కమల్‌ హాసన్‌ను కలవడం ఆసక్తిని రేపుతోంది.. అన్నాడీఎంకే నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతోనే శరత్‌కుమార్‌ ప్రత్యామ్నాయలవైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది..తమిళనాట మార్పు కోసం పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాము ఐజేకేతో చేతులు కలిపినట్టు శరత్‌ కుమార్‌ వెల్లడించారు. మంచి లక్ష్యాలు, భావసారూప్యత కలిగిన వ్యక్తులతో కలిసి కూటమి ఏర్పాటుపై కమల్‌ హాసన్‌తో చర్చించినట్లు తెలిపారు. దిగ్గజ నేతలైన కరుణానిధి, జయలలిత మరణంతో రాజకీయ శూన్యత నెలకొందన్న అభిప్రాయంతో భావ సారూప్యత కలిగిన పార్టీలు, వ్యక్తులతో కలిసి మూడో కూటమి ఏర్పాటు దిశగా కమల్‌హాసన్ పావులు కదుపుతున్నట్టు కనబడుతోంది.

ఇక స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే కాంగ్రెస్‌తో కలిసి అధికారం దిశగా అడుగులు వేస్తోంది. అన్నాడీఎంకే- భాజపా కూటమికి కాస్త గట్టిగానే సవాల్‌ విసురుతోంది. ఈ రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. 2016లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే 136 స్థానాల్లో గెలుపొందగా...డీఎంకే 89 సీట్లు, కాంగ్రెస్‌ 8 స్థానాలకు పరిమితమయ్యాయి.

ఇక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైందే తడవుగా తమిళనాట ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. అరియలూరు జిల్లాలో అధికారులు భారీగా ప్రెజర్‌ కుక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. గుమ్మడిపూండి నుంచి రెండు లారీలలో వీటిని తరలిస్తుండగా పట్టుకున్నారు. టీటీవీ దినకర్‌న్‌కు చెందిన ఏఎంఎంకే పార్టీ గుర్తు కూడా ప్రెజర్‌ కుక్కరే. ఈ కుక్కర్‌ ప్యాక్‌లపై దివంగత మాజీ సీఎం జయలలిత, శశికళ, ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి దినకరన్‌తో పాటు ఆ పార్టీ లీగల్‌ సెల్‌ కార్యదర్శి వేలు కార్తికేయన్‌ ఫొటోలు ఉన్నాయి. ఈ కుక్కర్ల విలువ 12లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story