తమిళనాడులో కురుస్తున్న హామీల వర్షం!

తమిళనాడులో కురుస్తున్న హామీల వర్షం!
ఉచితంగా వాషింగ్ మిషన్లు, సోలార్ స్టవ్‌లు, ప్రతి ఇంటికీ ఉచితంగా కేబుల్ టీవీ సదుపాయం కల్పిస్తామంటూ హామీల వర్షం.

తమిళనాడులో పోల్‌ ఫైట్‌ నడుస్తోంది.. ఎన్నికల కోసం పార్టీలన్నీ కుస్తీలు పడుతున్నాయి.. అధికార పార్టీ అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు 164 హామీలతో ముందుకొచ్చింది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఉచితాలకు పెద్దపీట వేశారు. అమ్మ హౌసింగ్ స్కీమ్‌ ద్వారా ప్రస్తుతం ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో భరోసా ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను గుర్తించి, ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లోనే రెసిడెన్షియల్ ఆపార్ట్‌మెంట్లు నిర్మించి ఇస్తామన్నారు. అలాగే ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది అన్నాడీఎంకే. బీపీఎల్ కుటుంబాలకు ఉచితంగా వాషింగ్ మిషన్లు, సోలార్ స్టవ్‌లు ఇస్తామని, ప్రతి ఇంటికీ ఉచితంగా కేబుల్ టీవీ సదుపాయం కల్పిస్తామంటూ హామీల వర్షం కురిపించింది. ఏటా పొంగల్‌కు ఇచ్చే రూ.2,500 నగదు పథకం కొనసాగుతుందని స్పష్టంచేసింది.

ఇప్పటికే రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని, విద్యార్థులకు విద్యా రుణాలు మాఫీ చేస్తామని, ఏడాదంతా విద్యార్థులకు 2జీబీ ఉచిత డాటా అందిస్తామని హామీ ఇచ్చిన అన్నాడీఎంకే.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని కూడా భరోసా ఇచ్చింది. ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 150 దినాలకు పెంచుతామని.. ఆటో రిక్షాలు కొనుగోలు చేయాలనుకునేవారికి 25వేల రూపాయల సబ్సిడీ ఇస్తామని చెప్పింది. గృహిణిలకు ప్రతి నెలా 1,500 రూపాయలు, ఏటా 6 ఎల్‌పీజీ డొమెస్టిక్ సిలెండర్లు ఉచితంగా ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా అనౌన్స్‌ చేయగా.. టౌన్ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టిక్కెట్ రేటులో 50 శాతం రాయితీ ఇస్తామని పేర్కొంది.

అటు తమిళనాడు విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది.. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడం ద్వారా తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పక్కా వ్యూహాలు అమలు చేస్తోంది.. ఈ నేపథ్యంలో 17 మంది అభ్యర్థులతో తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది. ఇందులో కుష్బూకు కూడా చోటు దక్కింది.. చెన్నైలోని థౌజంట్‌ లైట్స్‌ నియోజకవర్గం నుంచి కుష్బూ బరిలో దిగనున్నారు. తనకు టికెట్‌ ఇచ్చినందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ ఉన్న కుష్బూ గత ఏడాది బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరకముందు ఆమె డీఎంకేలో కొంతకాలం పాటు కొనసాగారు.

మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.. డీఎంకేకు షాకులు తగులుతున్నాయి. డీఎంకే ఎమ్మెల్యే శరవణన్‌ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మధురై ప్రాంతంలోని తిరుపుప్పరన్‌‌ కుండ్రమ్‌ నియోజవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శరవణన్ రాకతో బీజేపీలో చేరిన డీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య రెండుకు పెరిగింది. తాను పార్టీని వీడడానికి జిల్లా స్థాయిలోని ముఖ్య నేతలే కారణమని శరవణన్‌ ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story