రైతుల ఆందోళనలపై సెలబ్రెటీల వ్యాఖ్యలు.. స్పందించిన అమిత్ షా

రైతుల ఆందోళనలపై సెలబ్రెటీల వ్యాఖ్యలు.. స్పందించిన అమిత్ షా
రైతుల ఆందోళనలపై అంతర్జాతీయ సెలబ్రెటీలు చేస్తున్న వ్యాఖ్యలపై షా స్పందించారు.

దేశ ఐక్యతను ఎలాంటి దుష్ప్రచారాలు దెబ్బతీయలేవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. రైతుల ఆందోళనలపై అంతర్జాతీయ సెలబ్రెటీలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. దేశం అత్యున్నత స్థాయికి చేరకుండా ఎవరు అడ్డుకోలేరని షా ట్వీట్ చేశారు.

అంతకుముందు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో ఉద్యమిస్తున్న రైతులకు ప్రముఖ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌ సంఘీభావం ప్రకటించారు. రైతుల ఉద్యమంపై ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. రైతుల ఉద్యమం సాగుతున్న తీరు.. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో విధించిన ఆంక్షల వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ ప్రముఖ మీడియా సంస్థ సీఎన్‌ఎన్‌ కథనాన్ని థన్‌బర్గ్‌ తన పోస్ట్‌కు జత చేశారు.

అలాగే ప్రముఖ పాప్‌ సింగర్‌ రిహానా సైతం భారత్‌లో రైతులు చేస్తున్న ఉద్యమంపై తన భావాలను పంచుకున్నారు. మనమెందుకు దీని గురించి మాట్లాడటం లేదంటూ రైతుల ఉద్యమంపై సీఎన్‌ఎన్‌ ప్రచురించిన కథనాన్ని ట్వీట్‌ చేశారు. రిహానా ట్వీట్‌ చాలాసేపు ట్రెండ్‌ అవడం గమనార్హం. అనేక మంది రిహానా ట్వీట్‌కు స్పందించారు. కొంతమంది ఆమెకు మద్దతు తెలిపితే.. మరికొందరు పూర్తిస్థాయి అవగాహన తర్వాత స్పందించాలని హితవు పలికారు.

రిహానా ట్వీట్‌పై ప్రముఖ బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఉద్యమం చేస్తున్నది రైతులు కాదని.. దేశాన్ని విభజించాలనుకుంటున్న ఉగ్రవాదులని ట్వీట్ చేశారు. దేశాన్ని ముక్కలుముక్కలుగా చేసి చైనా కాలనీగా మార్చాలనుకుంటున్నారు. మా దేశాన్ని అమ్మాలనుకోవడం లేదు.. అందుకే ఎవరూ మాట్లాడటం లేదు... అంటూ రిహానాపై కంగనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

అటు.. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం కొనసాగుతోంది. జనవరి 26న రైతులు చేపట్టిన గణతంత్ర పరేడ్‌ ఉద్రిక్తంగా మారడంతో దీక్షా శిబిరాల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అలాగే ఫిబ్రవరి 6న మరోసారి భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు పిలుపునివ్వడం.. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అన్నదాతల కదలికలపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు.



Tags

Read MoreRead Less
Next Story