పబ్‌జీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త గేమ్‌తో మళ్లీ వస్తోంది!

పబ్‌జీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త గేమ్‌తో మళ్లీ వస్తోంది!

భారత మార్కెట్లోకి పబ్‌జీ మళ్లీ వస్తోంది. పబ్‌జీ మొబైల్‌ ఇండియా అనే సరికొత్త గేమ్‌తో తిరిగి అడుగుపెడుతున్నట్లు ప్రకటించింది పబ్‌జీ కార్పొరేషన్‌. దేశ సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, భద్రతకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ పబ్‌జీతో పాటు 118 మొబైల్‌ యాప్‌లపై కేంద్రం సెప్టెంబరులో నిషేధం విధించింది. ఆ నిషేధం తర్వాత పబ్‌జీ మొబైల్‌ ఫ్రాంఛైజీని భారత్‌లో పంపిణీ చేయడానికి చైనాకు చెందిన టెన్సెంట్‌ గేమ్‌కు ఎలాంటి అధికారం లేదని పీబ్‌జీ కార్పొరేషన్‌ ప్రకటించింది. భారత్‌లో అన్ని పబ్లిషింగ్‌ బాధ్యతలను తామే తీసుకుంటామని ఆ సమయంలో తెలిపింది. తాజాగా సరికొత్త గేమ్‌ను భారత మార్కెట్‌ కోసమే సృష్టించినట్లు పబ్‌జీ కార్పొరేషన్‌ స్పష్టం చేసింది.

దక్షిణ కొరియాకు చెందిన మాతృ సంస్థ క్రాఫ్టన్‌తో కలిసి భారత్‌లో స్థానిక వీడియోగేమ్‌, ఇ-స్పోర్ట్స్‌, వినోదం, ఐటీ పరిశ్రమలను తీసుకురావడానికి దాదాపు 750 కోట్లు రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు సంస్థ వెల్లడించింది. అదే సమయంలో భారత కంపెనీలోకి 100 మందికి పైగా ఉద్యోగులను తీసుకోనున్నట్లూ తెలిపింది. కొన్ని వార్తల ప్రకారం.. పబ్‌జీ నిషేధం తర్వాత స్మార్ట్‌ఫోన్‌ గేమర్లు సీఓడీ గేమ్‌కు మారినట్లు తెలుస్తోంది. మరో వైపు అక్షయ్‌కుమార్‌ మెంటార్‌షిప్‌లో ఫౌజీని తీసుకువస్తున్నట్లు బెంగళూరుకు చెందిన ఎన్‌కోర్‌ గేమ్స్‌ ఇప్పటికే ప్రకటించింది.

భారతదేశ నిబంధనలకు అనుగుణంగా పూర్తి డేటా భద్రతతో గేమ్‌ను తిరిగి తీసుకొస్తున్నట్టు ప్రకటించింది పబ్‌ జీ. డేటాకు పూర్తి రక్షణ కల్పించడంలో భాగంగా భారత వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని భద్రపరిచే స్టోరేజీ స్టిస్టమ్స్‌పై ఎప్పటికప్పుడు ఆడిట్, వెరిఫికేషన్స్ నిర్వహిస్తామని వివరించింది. స్థానిక అవసరాలను ప్రతిబింబించేలా ఆటలోని కంటెంట్‌ను మెరుగుపరుస్తామని పబ్‌జీ డెవలపర్లు పేర్కొన్నారు. వర్చువల్ సిమ్యులేషన్ ట్రైనింగ్ గ్రౌండ్ సెట్టింగ్, క్లాథింగ్, కొత్త కేరెక్టర్లు, ఎరుపునకు బదులుగా గ్రీన్ హిట్ ఎఫెక్ట్స్ వంటి మార్పులు ఉంటాయని చెప్పారు. యువ ఆటగాళ్ల కోసం భవిష్యత్తులో ఆట సమయాన్ని పరిమితం చేస్తామని కూడా పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story