పార్లమెంట్‌ను కుదిపేస్తున్న చమురు ధరలు

పార్లమెంట్‌ను కుదిపేస్తున్న చమురు ధరలు
పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తారని వస్తోన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

పార్లమెంట్‌లో రెండోరోజు కూడా ధరల పెంపుపై ఉభయ సభలు అట్టుడికిపోయాయి. దీంతో వాయిదాల పర్వం కొనసాగింది. మొదట లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు ఇంధన ధరల అంశాన్ని లేవనెత్తారు. ధరలను వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు. నిరసనల మధ్యే స్పీకర్‌ ఓంబిర్లా ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. ధరల పెరుగుదలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన చేశారు. స్పీకర్‌ వారించినా వెనక్కి తగ్గకపోవడంతో సభను మధ్యాహ్నాం వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సభ ప్రారంభమైనా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాకపోవడంతో మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. మూడోసారి కూడా సభలో అదే సీన్‌.. విపక్షాల ఆందోళనలు కొనసాగడంతో సభను స్పీకర్‌ ఇవాళ్టికి వాయిదా వేశారు. అటు ధరలు పెరుగుదలపై చర్చ చేపట్టాలని ఇచ్చిన వాయిదా తీర్మాన నోటీసులను ఓం బిర్లా తిరస్కరించారు.

రాజ్యసభలోనూ ఇదే గందరగోళం తలెత్తింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌, డీఎంకే, సీపీఎం, సీపీఐ, బీఎస్‌పీ, శివసేనకు చెందిన ఎంపీలు ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని ఆందోళన చేశారు. ధరలు తగ్గించాలని నినాదాలతో హోరెత్తించారు. ఎంపీల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభ కూడా లోక్‌సభ మాదిరిగానే వాయిదా పడింది. ధరల పెంపే ఏకైక ఎజెండాగా తీసుకున్న ప్రతిపక్షాలు.. పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలపై కచ్చితంగా చర్చ జరపాల్సిందేనని డిమాండ్ చేశాయి. గత ఆరేళ్లలో మోదీ సర్కారు.. పెట్రోల్, డీజీల్, గ్యాస్, పన్నులు, సెస్సుల రూపంలో కనీసం 21 లక్షల కోట్ల రూపాయలు రాబట్టుకుందని... ఆ డబ్బంతా ఎక్కడకు వెళ్లిందో సమాధానం చెప్పాలంటూ నిలదీశాయి.

పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకువస్తారని వస్తోన్న ఊహాగానాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. పెట్రోల్‌, డీజిల్‌ను వస్తు సేవల పన్ను పరిధిలోకి తెచ్చే అంశంపై జీఎస్‌టీ కౌన్సిల్ ఎలాంటి సిఫార్సు చేయలేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు. ఈ అంశంపై పలువురు రాజ్యసభ సభ్యలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర సహాయ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇంధన ధరలను జీఎస్‌టీ పరిధిలోకి తేవాలంటే మండలి ప్రతిపాదన చేయడం తప్పనిసరి అని.. అయితే, జీఎస్‌టీ మండలి ఇప్పటివరకు అలాంటి ప్రతిపాదన చేయలేదని స్పష్టంచేశారు.


Tags

Read MoreRead Less
Next Story