మన్‌సుక్‌ హిరేన్‌ హత్య కేసులో వాజేనే కీలక సూత్రధారి!

మన్‌సుక్‌ హిరేన్‌ హత్య కేసులో వాజేనే కీలక సూత్రధారి!
మన్‌సుక్‌ హిరేన్‌ హత్య కేసులో ఇప్పటికే సస్పెండైన సచిన్‌ వాజేనే కీలక సూత్రధారి అనిATS పేర్కొంది

ముఖేశ్‌ అంబానీ ఇంటి వద్ద స్కార్పియో వాహనంలో జిలెటిన్‌ స్టిక్స్‌ లభించిన కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది..ఆ వాహన యజమానిగా భావిస్తోన్న మన్‌సుక్‌ హిరేన్‌ హత్య కేసులో ఇప్పటికే సస్పెండైన సచిన్‌ వాజేనే కీలక సూత్రధారి అని మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం-ATS పేర్కొంది. ఇప్పటికే NIA కస్టడీలో ఉన్న సచిన్‌ వాజేను తమ కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టును ఆశ్రయించాలని భావిస్తోంది ATS. అయితే, ఈ కేసులో సచిన్‌ వాజే కుట్రకు గల ఉద్దేశాన్ని మాత్రం ఏటీఎస్‌ అధికారులు వెల్లడించలేదు.

ఈ కేసును ఇప్పటికే ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతోంది. మన్‌సుక్‌ హిరేన్‌ హత్య కేసును మాత్రం ముంబయి ఏటీఎస్‌ విచారిస్తోంది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఓ వోల్వో కారును సీజ్‌ చేశామని, ఫోరెన్సిక్‌ బృందం వాటిని పరీక్షిస్తోందని ఏటీఎస్‌ అధికారులు పేర్కొన్నారు. అయితే మన్‌సుక్‌ హత్యలో సచిన్‌ వాజే కీలక నిందితుడిగా ఉన్నప్పటికీ, ఘటన జరిగే వేళ ఆయన అక్కడ ఉండకపోవచ్చని, హత్య చేయమని మాత్రం ఆదేశించి ఉండవచ్చని భావిస్తున్నారు. సచిన్‌ వాజేను విచారించకుండానే ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను పొందగలిగామని ఏటీఎస్‌ అధికారులు చెప్పారు.

ఇక ఈ కేసుతో సంబంధముందని భావిస్తోన్న మాజీ కానిస్టేబుల్‌తో పాటు నరేష్‌ ధారే అలియాస్‌ నరేష్‌ గౌర్‌ అనే బుకీలను రెండు రోజుల క్రితమే పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సేకరించిన కీలక సమాచారం ఆధారంగానే హిరేన్‌ హత్యకేసులో సచిన్‌ వాజే హస్తమున్నట్లు నిర్ధారణకు వచ్చినట్లు ఏటీఎస్‌ అధికారులు వెల్లడించారు. వీరే కాకుండా ఈ కేసులో చాలా మంది హస్తం ఉందని, త్వరలోనే మరిన్ని అరెస్టులు జరుగుతాయని ఏటీఎస్‌ అధికారులు వెల్లడించారు.


Tags

Read MoreRead Less
Next Story